విజయ్ దేవరకొండ
‘‘ఇలాంటి ఒక సమస్య మన ముందుకు వస్తుందని ఎవరం ఊహించలేదు. కానీ మనందరం యోధులం. కలసికట్టుగా దీనిపై పోరాటం చేద్దాం’’ అంటున్నారు విజయ్ దేవరకొండ. కరోనా కష్ట సమయంలో సమాజానికి తన వంతు సహాయంగా రెండు ప్రకటనలు విడుదల చేశారు విజయ్. ఈ రెండు ప్రకటనలను ఒకటి అత్యవసరంగా కావాల్సినవి, భవిష్యత్తులో కావాల్సినవిగా విభజించారాయన. మొదటిది ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ద్వారా యువతకు ఉపాధి కల్పించడం. గత ఏడాదిగా వర్కవుట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం లక్ష మంది యువతకు ఉపాధి కల్పించడమే అని పేర్కొన్నారు. దీనికోసం కోటి రూపాయిలు ఖర్చు చేస్తున్నట్టు విజయ్ తెలిపారు. రెండవది ‘మిడిల్ క్లాస్ ఫండ్’.
ప్రభుత్వం నుంచి లబ్ధి పొందలేని మధ్య తరగతి కుటుంబాలకు ఈ ఫండ్ ద్వారా సహాయం చేయనున్నారు ఆయన. దీనికోసం 25 లక్షలు ప్రకటించారు. అవసరం ఉన్నవారు ‘ది దేవరకొండ ఫౌండేషన్.ఆర్గ్’ ద్వారా టీమ్‌ను సంప్రదించవచ్చన్నారు. ‘‘లాక్ డౌన్ కారణంగా మా టీమ్ మీ ఇంటి దగ్గరికి వచ్చి హెల్ప్ చెయ్యలేదు. అందుకే మీరు మీ ఇంటి దగ్గరే ఉన్న షాప్‌లో సరుకులు కొనవచ్చు. ఆ బిల్‌ను మేము ‘ది మిడిల్ క్లాస్ ఫండ్’ నుండి చెల్లిస్తాం. ఈ సమయంలో మనందరికీ కావాల్సింది ప్రేమ. ఒకరి నుంచి ఒకరికి భరోసా’’ అన్నారు విజయ్. ‘మిడిల్ క్లాస్ ఫండ్’కి ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ లక్ష రూపాయిలు విరాళంగా ప్రకటించారు. విజయ్ చేస్తున్న ఈ పనిని దర్శకులు కొరటాల శివ, పూరి జగన్నాథ్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment