పెళ్లైతే అమ్మగానే నటించాలా?
సినిమా : పెళ్లైన నటీమణులు అమ్మగానే నటించాలా? అని ప్రశ్నిస్తున్నారు నటి అమలాపాల్. మైనా చిత్రంతో మౌనంగా ఎదిగిన ఈ మలయాళీ బ్యూటీ విక్రమ్ సరసన దైవతిరుమగళ్, విజయ్‌కు జంటగా తలైవా వంటి భారీ చిత్రాల్లో నటించి అగ్ర కథానాయకిల సరసన చేరారు. ఆ తరువాత అమలాపాల్‌కు తెలుగులోనూ అవకాశాలు వరించాయి. ఇలా తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తూ యమబిజీగా ఉన్న సమయంలోనే యువ దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టారు. అయితే చిన్న గ్యాప్ తరువాత మళ్లీ ముఖానికి రంగేసుకోవడానికి సిద్ధం అయ్యారు. తాజాగా అమలాపాల్ నటించిన అమ్మాకణక్కు ఇటీవల తెరపైకి వచ్చింది. ఇందులో ఆమె పదో తరగతి చదువుతున్న అమ్మాయికి అమ్మగా నటించడం విశేషం. ఈ సందర్భంగా ఈ అమ్మడితో చిన్న భేటీ.
ప్ర: అమ్మాకణక్కు చిత్రంలో నటించిన అనుభవం గురించి?
జ: ఈ చిత్రంలో శాంతి అనే పాత్రలో నటించాను. ఈ పాత్ర కోసం చాలా హోమ్ వర్క్ చేశాను. బరువు పెరిగాను. యోగా, మెడిటేషన్ చేసి మానసికంగా సిద్ధం అయ్యాను. చేపలమ్మే స్త్రీగా బట్టలు ఉతికే పని, పిండి ఆడించే పని, ఇంటి పనిమనిషి అంటూ రకరకాల పరిమాణాల్లో నన్నీ చిత్రంలో చూస్తారు. ఇది సహజత్వంతో కూడిన కథా చిత్రం కావడంతో మేకప్ లేకుండానే నటించాను. ఇంకా చెప్పాలంటే ఈ చిత్రంలో 15 ఏళ్ల అమ్మాయికి అమ్మగా నటించాను. మొత్తం మీద అమ్మాకణక్కు చిత్రంలో నటించడం మంచి అనుభవం
ప్ర: ఇందులో అమ్మగా నటించడానికి సంకోచించారటగా?
జ: నిజం చెప్పాలంటే నటికి వివాహం అయితే అక్క, వదిన, అమ్మ పాత్రలకు పరిమితం అనే ముద్ర వేసేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. నటిని నటిగా చూడాలి. నేను హీరోయిన్‌గా నటిస్తున్న సమయంలోనే మలయాళంలో నటించిన మిలీ, తమిళంలో చేసిన పసంగ -2 చిత్రాలు నన్ను వేరే కోణంలో ప్రేక్షకుల ముందు నిలబెట్టాయి. మైనా చిత్రం తరువాత ఛాలెంజింగ్ పాత్ర అంటే అమ్మాకణక్కులో చేసిన పాత్రే. ఇందులో నా నటనకు పెద్ద ఇన్సిపిరేషన్ మా అమ్మనే.
ప్ర: సంసారజీవితం ఎలా సాగుతోంది?
జ: నా భర్త విజయ్‌తో చాలా సంతోషంగా ఉన్నాను. తమిళనాడుకు కోడలిగా వచ్చాను. ఇప్పుడు కూతురిగా చూసుకుంటున్నారు. నటిగా పలు భాషల్లో బిజీగా నటిస్తున్నాను. ఇందుకు నా భర్త, ఆయన కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిది.
ప్ర: కన్నడంలో సుదీప్ సరసన నటిస్తున్నారటగా?
జ: ప్రస్తుతం తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో నటిస్తున్నాను. అయితే సాదాసీదా హీరోయిన్ పాత్రలు ధరించడం ఇష్టం లేదు. మలయాళంలో కుంజాకోబొపన్, జయసూర్యకు జంటగా నటిస్తున్న షాజహానుమ్ పరికుట్టియుమ్ చిత్రాలు నా కేరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతాయి. ఇక కన్నడంలో సుదీప్ సరసన హెంబులి చిత్రంలో నటిస్తున్నాను. ఇందులో ఎవరూ ఊహించని పాత్రలో కనిపిస్తాను.
ప్ర: దర్శకత్వం చేసే ఆలోచన ఉందా?
జ: విజయ్ దర్శకత్వం వహించే చిత్రాల షూటింగ్ స్పాట్‌కు వెళుతుంటాను. అక్కడ అన్ని విషయాలు గమనిస్తుంటాను. దర్శకత్వం అన్నది సాధారణ విషయం కాదు. కాబట్టి ఆ రంగంలో ఆసక్తి లేదు. విజయ్‌తో కలిసి చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించాను.
ప్రస్తుతం ప్రియదర్శన్ దర్శకత్వంలో సిల సమయంగళ్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాం.