
ప్రేమమ్ హీరోయిన్లు ఎవరు?
ప్రేమమ్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో మారుమోగుతున్న పేరు ఇది. ఈ పేరుతో మలయాళంలో రూపొందించిన చిత్రం అనూహ్య విజయం సాధించింది. దీనికి సృష్టికర్త పుత్రన్. నవీన్ కథానాయకుడు. మడోనా సెబాస్టియన్, సాయిపల్లవి, అనుపమ పరమేశ్వర్ ముగ్గురు నాయికలు. ఈ ముగ్గురే ప్రేమమ్ చిత్ర కథకు మూలం, ప్రాణం. దీన్ని దక్షిణాది భాషల్లో రీమేక్ చేయడానికి గట్టి పోటీనే నెలకొంది. ఇప్పటికే టాలీవుడ్‌లో పునర్ నిర్మాణానికి ప్రేమమ్ చిత్రం సిద్ధమైంది.
నాగచైతన్య హీరోగా నటించనున్నారు. ఇక ఒక హీరోయిన్‌గా క్రేజీ నటి శ్రుతిహాసన్ ఎంపికయ్యారు. ఇప్పుడు కోలీవుడ్‌లోనూ ప్రేమమ్ చిత్రం రీమేక్ కానుందన్నది తాజా సమాచారం. దీన్ని తమిళంలో చిత్రంగా మలిచే బాధ్యతల్ని ఐశ్వర్య ధనుష్ చేపట్టనున్నారు. ఈమె ఇంతకు ముందు 3, వై రాజా వై చిత్రాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. మూడవ చిత్రంగా ప్రేమమ్ రీమేక్‌కు సిద్ధమవుతున్నారు.
ఇందులో హీరోగా విజయ్ సేతుపతి నటించే అవకాశం రాగా హీరోయిున్ల అన్వేషణలో చిత్ర యూనిట్ నిమగ్నమైంది. మలయాళంలో నటి సాయి పల్లవి చేసిన పాత్రను తమిళంలో నటి హన్సిక గాని, శ్రుతిహాసన్ గాని పోషించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరో ఇద్దరు హీరోయిన్ల ఎంపిక జరగాల్సింది. అదే విధంగా ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని, బాల సుబ్రమణ్యం చాయాగ్రహణం అందించనున్నారు.