
తమిళసినిమా: ‘చిరుత’ సినిమాతో తెలుగువారిని పలుకరించిన నటి నేహా శర్మ గుర్తుందా? ఇటీవల విడుదలైన ’సోలో’ చిత్రంలో దుల్కర్‌సల్మాన్‌తో రొమాన్స్ చేసిందీ భామ. తాజాగా మరో అవకాశాన్ని తన ఖాతాలో వేసుకుంది. యువ నటుడు విజయ్‌సేతుపతి కథాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం జుంగా. రూ.20 కోట్ల భారీ బడ్జెట్‌తో విజయ్ స్వయంగా నిర్మిస్తున్నఈ సినిమాలో సయేషా సైగల్ మొదటి హీరోయిన్‌గా ఎంపికవ్వగా.. రెండో హీరోయిన్‌గా నేహా శర్మకు చాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది.
ఈ విషయమై ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఈ సినిమాలో చేయడానికి ఆమె అంగీకరించిందని చిత్ర దర్శకుడు గోకుల్ తెలిపారు. ఇందులో నేహాశర్మ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని, ఆమె చిన్నపాటి డాన్ పాత్రలో కనిపిస్తుందని చెప్పారు. విజయ్‌సేతుపతితో నేహాకు ఒక డ్యూయెట్ కూడా ఉంటుందన్నారు. కాగా విజయ్‌సేతుపతి-గోకుల్ కాంబినేషన్‌లో ఇంతకుముందు ‘ఇదర్కుదానే ఆశైపట్టాయ్ బాలకుమారా’ వంటి విజయవంతమైన చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఈ హిట్ కాంబినేషన్‌లో వస్తున్న జుంగా కూడా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావంతో ఉంది.