టాప్ హీరోయిన్ కాలేకపోయా..
పలు భాషల్లో నటించినా ప్రముఖ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోలేకపోయానని నటి తాప్సీ వాపోతున్నారు. బహుభాషా నటిగా గుర్తింపు పొందిన మూడు పదుల వయసుకు చేరవలో ఉన్న ఈ ఢిల్లీ భామ తమిళంలో ధనుష్ సరసన ఆడుగళం చిత్రంతో పరిచయం అయ్యారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత కూడా జీవా తదితర పలువురు యువ నటులకు జంటగా నటించారు. ఇటీవల కాంచన-2లో లారెన్స్‌తో నటించి విజయాన్ని అందుకున్నారు. అదే విధంగా తెలుగు, మలయాళం, హిందీ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు.
తెలుగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఝుమ్మంది నాదం చిత్రం ద్వారా దిగుమతి అయ్యారు. ఇలా బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నా టాప్ నాయికల వరుసలో చేరలేకపోయారు. ఇది తనకు బాధాకరమైన విషయమేనంటున్న తాప్సీ ప్రముఖ హీరోల సరసన నటిస్తేనే తగినంత ప్రాచుర్యం లభిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు లేకపోయినా హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు.
బాలీవుడ్‌లో రాణించడం చాలా కష్టం అంటున్న తాప్సీకీ ఇప్పుడు బిగ్‌బీ అమితాబ్‌తో నటించే లక్కీ ఛాన్స్ లభించింది. అదే విధంగా అక్షయ్‌కుమార్‌తో ఒక చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాలపై తను చాలా నమ్మకం పెట్టుకున్నారట. ఈ రెండు చిత్రాలు విడుదలైన తరువాత తన రేంజే మారిపోతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కచ్చితంగా తానూ టాప్ హీరోయిన్ అనిపించుకుంటాననే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.