వేదిక
‘‘ఒక్కో ఇండస్ట్రీ ఒక్కోలాంటి సినిమాలు తీస్తుంది. తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో నేను సినిమాలు చేస్తుంటాను. పలు భాషల్లో సినిమాలు చేయడం వల్ల విభిన్నత చూపించడానికి నటిగా నాకు మంచి అవకాశం అనుకుంటాను’’ అన్నారు వేదిక. బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రూలర్’. వేదిక, సోనాల్ చౌహాన్ కథానాయికలు. సి. కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. ‘బాణం, విజయ దశమి, దగ్గరగా దూరంగా’ సినిమాల్లో కనిపించి వేదిక 7 ఏళ్ల విరామం తర్వాత ‘రూలర్’ అనే తెలుగు సినిమా చేశారు. ఈ సందర్భంగా వేదిక పంచుకున్న విశేషాలు...
► ఇతర భాషల్లో సినిమాలతో బిజీగా ఉండటంతో తెలుగులో సినిమాలు చేసే వీలు కుదర్లేదు. అక్కడ వరుస చిత్రాలతో ఇక్కడ ఎక్కువ దృష్టి పెట్టలేకపోయాను. నాకు తెలుగులో మేనేజర్ కూడా లేరు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘కాంచన 3’ తమిళంలో, తెలుగులో హిట్ అయింది. నా పాత్రకు మంచి స్పందన రావడంతో ‘రూలర్’కి నన్ను సంప్రదించారు.
► బాలకృష్ణగారిలాంటి పెద్ద స్టార్ సినిమాలో అవకాశం రావడం మంచి అవకాశంగా భావించాను. కేఎస్ రవికుమార్‌గారు చాలా మంచి సినిమాలు తీశారు. ఈ సినిమాను పూర్తి చేయాలంటే ఏడాది పడుతుంది. కానీ, మూడున్నర నెలల్లో పూర్తి చేశారాయన. సి.కల్యాణ్‌గారు రాజీపడకుండా క్వాలిటీతో తెరకెక్కించారు.
► ‘రూలర్’ సినిమాలో నా పాత్రకు రెండు షేడ్స్ ఉంటాయి. ఒకటి సంప్రదాయబద్ధంగా, మరొకటి ఫుల్ గ్లామరస్‌గా ఉండేది. డామినేటింగ్‌గా ఉండే పాత్ర నాది. సప్తగిరితో కలసి కామెడీ చేస్తాను. నటనకు స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. ఈ సినిమాలో పాత్రలానే నేనూ డామినేటింగే. కానీ నా ఫేస్ అలా కనిపించదు(నవ్వుతూ).
► బాలకృష్ణగారి ఎనర్జీ సూపర్. డ్యాన్స్ ఎంజాయ్ చేస్తూ చేస్తారు. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేశాను(నవ్వుతూ). ఆయన డైలాగ్స్, యాక్టింగ్‌లో ఒక స్టయిల్ ఉంటుంది. ఆయన అందర్నీ సమానంగా చూసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment