మా మతం స్వీకరించరూ?
మనువాడడానికి మతం అడ్డు వస్తోందా? వధూవరులిద్దరూ ఒకే మతానికి చెందాల్సిందేననే భావన ఈ ఆధునిక యుగంలోనూ చాలా మందిలో నెలకొంది. ఇరుమతాలకు చెందిన ప్రేమికులైతే పెళ్లికి ముందు ఎవరో ఒకరు మతం మార్చుకోవాల్సిందే. నటి నయనతార విషయంలో ఇదే జరిగింది. ఈమె దర్శక నటుడు, నృత్య దర్శకుడు ప్రభుదేవా గాఢంగా ప్రేమించుకున్నారు. వారి పెళ్లికి మతం అడ్డుగోడ కావడంతో క్రిస్టియన్ అయిన నయనతార హిందూ మతం స్వీకరించారు.
తాజాగా దర్శకుడు విజయ్, అమలాపాల్ పెళ్లి జూన్ 12న చెన్నైలో జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా నటి అమలాపాల్ క్రిస్టియన్, దర్శకుడు విజయ్ హిందువు.దీంతో వీరి పెళ్లికి మతం అడ్డొస్తోందని సమాచారం. అమలాపాల్ కోసం ఆమె కుటుంబ సభ్యులు దర్శకుడు విజయ్‌ను మతం మార్చుకోవాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. మత మార్పిడికి విజయ్ సిద్ధంగా లేరని సమాచారం. మరి ప్రేమించిన అమలాపాల్ కోసం విజయ్ మతం మార్చుకుంటారా? లేదా? అన్నది కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.