
పెరంబూరు: నకిలీ పెళ్లి రిజిస్టేషన్ పత్రాలతో అసత్యాలను ప్రచారం చేస్తున్నాడని నటుడు అభిశరవణన్‌పై నటి అతిథిమీనన్ సోమవారం స్థానిక వెప్పేరిలోని పోలీస్‌కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అందులో ఆమె పేర్కొంటూ తాను కేరళకు చెందిన నటినని పేర్కొంది. తన వయసు 26 అని, పట్టాదారి అనే తమిళ చిత్రంతో కోలీవుడ్‌లో పరిచయం అయినట్లు తెలిపింది. ప్రస్తుతం తను చెన్నైలోనే నివసిస్తున్నానని పేర్కొంది. పట్టాదారి చిత్రంలో మదురైకి చెందిన శరవణకుమార్ అనే వ్యక్తి అభిశరవణన్‌గా పేరు మార్చుకుని హీరోగా నటించాడని తెలిపింది. ఆ చిత్ర షూటింగ్ సమయంలో తామిద్దరం ప్రేమించుకున్నామని చెప్పింది. అలాంటి సమయంలో అభిశరవణన్ నకిలీ రిజిస్టర్ పెళ్లి పత్రాల్లో తన చేత సంతకం చేయించాడని చెప్పింది. ఆ తరువాత అభిశరవణన్ ప్రవర్తనలో మార్పు రావడంతో తాను అతని నుంచి దూరం అయ్యానని తెలిపింది.
దీంతో తమను ఒకటిగా చేర్చాలని కోరుతూ అభిశరవణన్ మదురై కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడని చెప్పింది. నిజానికి తాను ఏ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లి పెళ్లి ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేయలేదని తెలిపింది. అలాంటిది అభిశరవణన్ నకిలీ పెళ్లి ధ్రువపత్రాలను, తాను అతనితో దిగిన ఫొటోలను వాట్సాప్‌లో పోస్ట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నాడని తెలిపింది. ఈ వ్యవహారంలో అతను, అతని అనుచరులపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరింది. అభిశరవణన్ సామాజిక సేవ పేరుతో పలువురి వద్ద డబ్బు పొంది మోసానికి పాల్పడడం వల్లే తాను అతనిని వదిలి వచ్చేశానని అతిథిమీనన్ అందులో పేర్కొంది. ఆమె ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇటీవల నటుడు అభిశరవణన్‌ను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసిన సంఘటన గురించి తెలిసిందే. అందులో నటి అతిథిమీనన్ హస్తం ఉందనే ప్రచారం జరిగిందన్నది గమనార్హం.