అన్నకు గుర్తింపుపై మోజు లేదు
అన్నకు గుర్తింపుపై మోజు లేదు
Published Fri, Dec 13 2013 12:27 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
ముంబై: తన అన్నయ్య ఆదిత్యతో పెద్ద చిక్కొచ్చిపడిందని చెబుతున్నాడు నటుడు, నిర్మాత ఉదయ్ చోప్రా. గుర్తింపు రావాలన్న తపన ఆయనలో కనిపించిందన్నది ఇతడి బాధ. ఇద్దరం ఒకే తల్లి కడుపులో పుట్టినా వీరి మనస్తత్వాలు విభిన్నంగా ఉంటాయి. ఆదిత్య ముభావంగా ఉండే వ్యక్తి కాగా, ఉదయ్ చలాకీగా కనిపిస్తుంటాడు. ‘అన్నయ్యకు మీడియా అంటే కోపం ఏమీ లేదు కానీ వారితో మాట్లాడడానికి ఇష్టపడడు. ఎందుకంటే గుర్తింపు రావాలన్న కోరిక ఆయనలో ఉండదు. ఇదే అసలు సమస్య. శుక్రవారం విడుదలైన ప్రతి కొత్త సినిమానూ మొదటి ఆటే చూస్తాడు.
థియేటర్లోనూ సామాన్య ప్రేక్షకుడిగా ఉండడమే ఆయనకు ఇష్టం. చుట్టూ ఎక్కువ మంది ఉండడాన్ని ఇష్టపడడు’ అని ఉదయ్ వివరించాడు.ఈరోజుల్లో ఆదిత్యలా ఉంటే కుదరదని, పదిమందిలోనూ గుర్తింపు తెచ్చుకోవడం తప్పనిసరని చెప్పాడు. పెద్దగా వెలుగులోకి రానప్పటికీ ఆదిత్యకు వచ్చిన సమస్యేమీ లేదన్నాడు. మనలో ప్రతిభ ఉండి దానిని ఎప్పటికప్పుడు నిరూపించుకోగలిగితే సరిపోతుందని తెలిపాడు. ఉదయ్ ఎప్పుడైనా సమస్యల్లో ఉన్నా అన్నగా సలహాలు ఇవ్వడంలో ఆదిత్య ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడట.
‘మా ఇంట్లో అందరికీ మనోబలం ఎక్కువే. ఆయన సలహాలు కూడా బాగానే ఉంటాయి. అయితే నిర్ణయాన్ని మనకే వదిలిపెడతాడు. ప్యార్ ఇంపాజిబుల్ సినిమా వైఫల్యం తరువాత.. నా కెరీర్ యథాతథంగా ఉంటుందని, అవకాశాలు వస్తుంటాయని కూడా ధైర్యం చెప్పాడు. సినిమాల్లో ముందుకు సాగాలంటే ఇంకా ఏదైనా చేస్తే బాగుండు అనిపించింది. అందుకే నిర్మాణరంగంలోకి అడుగుపెట్టాను. ఇందులో ఎవరి బలవంతమూ లేదు’ అని ఉదయ్ వివరించాడు. తాజాగా ఇతడు ధూమ్3లో నటించగా, ఆదిత్యచోప్రాయే దీనిని నిర్మించాడు.
Advertisement
Advertisement