నటనే ఆయన ప్రాణం.. చివరకు వరకు నటనే
పదిహేడేళ్ల వయసులోనే ముఖానికి రంగు వేసుకుని తెరంగేట్రం చేసిన అక్కినేని నాగేశ్వరరావు.. చిట్టచివరి వరకు కూడా సినీ కళామతల్లికి సేవ చేస్తూనే ఉన్నారు. తనకు కేన్సర్ వచ్చిందని, దాన్ని కూడా జయిస్తానని ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించిన ఘనత ఆయనొక్కరికే దక్కుతుంది. కేన్సర్ మహమ్మారి ఒకవైపు తన శరీరాన్ని కబళిస్తున్నా... నటనే తన ఊపిరి అంటూ చిట్ట చివర కూడా మూడుతరాల అక్కినేని నటులు కలిసి చేస్తున్న 'మనం' సినిమాలో నటించారు. దాంతో కలిపి మొత్తం 256 సినిమాల్లో ఆయన చేశారు.
తెలుగుతో పాటు పలు తమిళ చిత్రాల్లోనూ ఏఎన్ఆర్ నటించారు.
ఉత్తమ నటుడిగా నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సహా ఏఎన్‌ఆర్‌కు 1968లో పద్మశ్రీ, 1989లో రఘుపతి వెంకయ్య అవార్డు, 1991లో దాదాసాహెబ్ ఫాల్కే, 1998లో పద్మభూషణ్, 1996లో ఎన్టీఆర్ జాతీయ, 2011లో పద్మవిభూషణ్ అవార్డులు వచ్చాయి. అలాగే, మేఘసందేశం, బంగారుకుటుంబం చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి కళైమామణి, మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి కాళిదాసు కౌస్తుభ అవార్డులు కూడా ఆయనకు అందాయి. నవరాత్రి సినిమాలో 9 పాత్రలు చేసిన ఏకైక తెలుగు నటుడు నాగేశ్వరరావే.