సాక్షి, ముంబై : మన హీరోలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటే.. ఆ సమయంలో ఖచ్ఛితంగా ఏదో ఆశించే వారు అలా చేసుంటారని కొంత మంది అనుకుంటుంటారు. ముఖ్యంగా సినిమా ప్రమోషన్ల సమయంలో వాళ్లు చేసే షకలు చూస్తే అలా అనుకోవటం తప్పేం లేదు. కానీ, బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ అలాంటోడు అస్సలు కాదు. రియల్ లైఫ్‌లోనూ ఆయన్ను హీరోగా చెబుతుంటారు.
ప్రభుత్వాలు కూడా అంతగా పట్టించుకోని అంశాలపై స్పందించి వాటిని వెలుగులోకి తెస్తూ.. తన వంతుగా సాయం కూడా చేస్తున్నాడు. గతంలో మహారాష్ట్ర రైతులకు సాయం, మరుగుదొడ్ల నిర్మాణానికి చేయూత.. మావోయిస్టుల దాడిలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం ఇవన్నీ ఆ కోవలోకే వస్తాయి. అలాంటి అక్కీ ఈ దీపావళికి కూడా మళ్లీ అలాంటి పనే చేశాడు. కోహ్లపూర్ స్పెషల్ ఐజీ విశ్వాస్ నంగరే పాటిల్ అమర వీరుల కుటుంబాల జాబితాను ఒకటి తయారు చేసి వారి కుటుంబాలకు మిఠాయిలు పంచాడు. ఈ విషయం తెలుసుకున్న అక్కీ ఆ జాబితాను తెప్పించుకుని స్వీట్లు, పిల్లలకు పుస్తకాలతోపాటు 25,000 రూపాయల చెక్కులను పంపించాడు.
‘‘దేశం కోసం మీకుటుంబాలు చేసిన త్యాగం మరువలేనిది. వాళ్లు ఈ పండగ పూట మీ మధ్య లేకపోవటంతో ఎంత బాధాకరమో అర్థం చేసుకోగలం. కానీ, వారి బలిదానాలకు గుర్తు చేసుకుంటూ నూతన ఉత్సాహంతో జీవితంలో మీరు ముందుకు సాగాలి. మీ కోసం పంపుతున్న ఈ చిరు కానుకలను ప్రేమతో ఆహ్వానిస్తారని ఆశిస్తున్నా’’ అంటూ ఓ సందేశంతో వాటిని పంపాడు. అమర వీరులకు కుటుంబాలకు ఇలా ఆర్థిక సాయం చేయటమే కాదు.. కొన్ని నెలల ఓ ప్రత్యేక యాప్ రూపకల్పన చేసి దాని ద్వారా ఇలా ఉన్న సాధారణ ప్రజలను ఆదుకునేందుకు ఈ కిలాడీ హీరో ప్రయత్నించాడు కూడా.
Comments
Please login to add a commentAdd a comment