
ఆ హీరోను గే అనుకున్న హీరోయిన్ తల్లి
ముంబై: బాలీవుడ్ జంట అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా పెళ్లి చేసుకుని 15 ఏళ్లు అవుతోంది. వివాహానికి ముందు ఆ తర్వాత అక్షయ్ పలువురు హీరోయిన్లతో ఎఫైర్ నడిపినట్టు పుకార్లు వచ్చినా వీరి బంధం సవ్యంగా సాగుతోంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న ట్వింకిల్ అలనాటి మేటి నటులు రాజేష్ ఖన్నా, డింపుల్ కంపాడియాల ముద్దుల కూతురు. అక్షయ్, ట్వింకిల్ దంపతులు తమ ప్రేమ, వివాహ బంధం గురించి ఓ టీవీలో షోలో ఆసక్తికర విషయాలు చెప్పారు.
15 ఏళ్ల క్రితం అమీర్ ఖాన్ సరసన ట్వింకిల్ నటించిన మేలా సినిమా షూటింగ్ సమయంలో అక్షయ్ ఆమెకు పెళ్లి ప్రపోజల్ చేశాడు. ఆ తర్వాత ట్వింకిల్ కెరీర్ గురించి ఇద్దరూ ఆలోచించారు. మేలా సినిమా ఫ్లాప్ అయితే పెళ్లి చేసుకుంటానని ఆమె అక్షయ్‌కు షరతు పెట్టింది. కాగా ఈ సినిమా విడుదలైన మూడు రోజుల తర్వాత ట్వింకిల్ అక్షయ్‌కు ఫోన్ చేసి వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్షయ్.. ట్వింకిల్ ఇంటికి వెళ్లి ఆమె తల్లి డింపుల్ కపాడియాను కలిశాడు. ట్వింకిల్‌ను పెళ్లి చేసుకుంటానని అడిగాడు. కాగా ట్వింకిల్‌ను అక్షయ్‌కు ఇచ్చి పెళ్లి చేసేందుకు మొదట్లో డింపుల్ సంశయించింది. అతను గే అని డింపుల్ భావించడమే దీనికి కారణం. అక్షయ్ గే అని డింపుల్ స్నేహితురాలు ఒకరు చెప్పినట్టు ట్వింకిల్ వెల్లడించింది. ఆ తర్వాత నిజం తెలుసుకున్న డింపుల్ కూతురి పెళ్లికి అనుమతిచ్చింది. పెళ్లికి ముందు తన కుటుంబ సభ్యులు, వారి ఆరోగ్య వివరాల గురించి ట్వింకిల్ అడిగిందని, అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత పెళ్లాడిందని అక్షయ్ చెప్పాడు.