అనుకున్నామని జరగవు అన్నీ...
ఏ బియ్యపు గింజ మీద ఎవరి పేరు రాసి ఉంటుందో ఎవరికి తెలుసు?
సినిమా పాత్రల విషయమూ సరిగ్గా అంతే!
ఒక పాత్ర ఒకరి కోసం అనుకున్నా... ఆఖరికి అది వేరెవరికో దక్కడం సినీ రంగంలో సహజం.
అలాంటి కొన్ని హిందీ చిత్రాలు... విచిత్రాలు...
‘జంజీర్’ అనగానే మనకు అమితాబ్ గుర్తుకొస్తారు. కానీ, జంట రచయితలు సలీమ్ -జావేద్ ‘జంజీర్’ కథ తయారు చేసి మొదట వినిపించింది దేవానంద్‌కు! ఆ తర్వాత ధర్మేంద్రకు చెప్పారు. ఇద్దరూ నిరాకరించారు. రాజేశ్ ఖన్నాకు చెబుదా మనుకున్నారు. అయితే ‘హాథీ మేరే సాథీ’ షూటింగ్‌లో రాజేశ్ ఖన్నాకు, వీరికి భేదాభిప్రాయాలు వచ్చాయి. మరి ఈ కథను ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా అమితాబ్ బచ్చన్ నటించిన ‘బాంబే టూ గోవా’ చూశారు జావేద్.
* ఆ కథకు అతనే హీరో అని నిర్ణయించేసుకున్నారు. అలా అనుకోకుండా దక్కిన ‘జంజీర్’తో అమితాబ్ సూపర్‌స్టారైపోయారు.
* ‘షోలే’లో గబ్బర్‌సింగ్ పాత్రకు మొదట డానీని అనుకున్నారు. ఆయన నిరాకరించడంతో అమ్జాద్‌ఖాన్‌కు అవకాశం దక్కింది.
* ‘ఆనంద్’ సినిమాను హృషీకేశ్ ముఖర్జీ నిజానికి ఉత్తమ్‌కుమార్‌తో తీయాలనుకున్నారు. కుదర్లేదు. ఆ తర్వాత కిశోర్‌కుమార్, శశికపూర్‌తో చేయాలనుకున్నారు. చివరకు రాజేశ్‌ఖన్నా, అమితాబ్ బచ్చన్‌తో ‘ఆనంద్’ పూర్తి చేశారు.
* ‘రజనీగంధ’ చిత్రంలో మొదట శశికపూర్, షర్మిలా టాగూర్, అమితాబ్ బచ్చన్‌లను తీసుకోవాలనుకున్నారు బాసూ చటర్జీ. కానీ, వారి కాల్‌షీట్లు దొరకలేదట. అందుకే కొత్త తారలతో చేయాలని నిశ్చయించుకున్నారు. శశికపూర్ వేషానికి అమోల్ పాలేకర్‌ను, షర్మిలా టాగూర్ వేషానికి విద్యను, అమితాబ్ వేషానికి దినేష్ టాగూర్‌ను తీసుకున్నారు. కొత్తవారితో తీసిన ఆ చిత్రం గొప్ప విజయం సాధించింది.
* అనిల్‌కపూర్, శ్రీదేవి నటించిన ‘మిస్టర్ ఇండియా’ చిత్రంలో మొదట హీరోగా అమితాబ్ బచ్చన్‌ను అనుకున్నారు.
* షారుక్ ఖాన్ కెరీర్‌లో మైలురాయి అంటే ‘దిల్ వాలే దుల్హేనియా లేజాయేంగే’చెప్పుకోవాలి. అందులో హీరోగా మొదట అనుకున్నది - సైఫ్ అలీఖాన్‌ని.
* ‘లగాన్, మున్నాభాయ్ ఎంబీబీఎస్’ చిత్రాలకు హీరోగా ముందు షారుక్ ఖాన్‌ను అనుకున్నారు. చివరకు ‘లగాన్’ ఆమిర్‌ఖాన్ చేస్తే, ‘మున్నాభాయ్’ చిత్రాన్ని సంజయ్‌దత్ చేశారు.
* వసూళ్లలో సంచలనం సృష్టించిన ‘త్రీ ఇడియట్స్’కు మొదట హీరోగా షారుక్‌ఖాన్‌ను అనుకున్నారు రాజ్‌కుమార్ హిరానీ. అయితే షారుక్ ఖాన్ తన సొంత సంస్థలో చేద్దామని షరతు పెట్టాడు. దాంతో ఆ సినిమా ఆమిర్‌ఖాన్ దగ్గరకు వచ్చింది.
* ‘రంగ్ దే బసంతి’ నిజానికి హృతిక్ రోషన్ సినిమా. ఆయన ఈ కథ చేయడానికి ఆసక్తి చూపలేదు. ఆమిర్‌ఖాన్ మాత్రం ఎంతో ఇష్టపడి ఈ సినిమా చేశాడు.