మరోసారి అల్లరోడి సెల్ఫీ సినిమా..?
ప్రస్తుతం యంగ్ హీరో అల్లరి నరేష్కు బ్యాడ్ టైం నడుస్తోంది. ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ కామెడీ స్టార్, ఇప్పుడు తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో తడబడుతున్నాడు. ముఖ్యంగా రొటీన్ పేరడీ కామెడీతో బోర్ కొట్టించిన నరేష్ భారీ హిట్ చూసి చాలా కాలమే అవుతోంది. భారీ ఆశలతో చేసిన సెల్పీరాజా కూడా నరేష్ కెరీర్ను గాడిలో పెట్టలేకపోయింది.
దీంతో మరోసారి తనకు బాగా కలిసొచ్చిన రీమేక్ ఫార్ములాను నమ్ముకుంటున్నాడు నరేష్. గతంలో తమిళ పడం సినిమాకు రీమేక్గా తెరకెక్కిన సుడిగాడు సినిమాలో నటించిన నరేష్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అదే బాటలో మలయాళ హిట్ సినిమా ఒరు వడక్కన్ సెల్ఫీ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు.
మలయాళ యువ కథానాయకుడు నివీన్ పౌలీ హీరోగా నటించిన ఈ సినిమాకు జి.ప్రజిత్ దర్శకుడు. కామెడీ సినిమానే అయినా క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉండటంతో తెలుగు నేటివిటికీ కూడా సూట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. జాహ్నవీ ఫిలింస్ బ్యానర్పై రీమేక్ అవుతున్న ఈ సినిమాకు సంబందించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.