
మా అబ్బాయి-అమలాపాల్ విడిపోవడానికి ధనుషే అసలైన కారణం
దర్శకుడు విజయ్, అమలాపాల్ విడిపోవడానికి నటుడు ధనుషే కారణం అట. మైనా చిత్రంతో కోలీవుడ్‌లో పాపులర్ అయిన మలయాళ కుట్టి అమలాపాల్. ఆ తరువాత వరుసగా ఆమెకు అవకాశాలు రావడం ప్రారంభం అయ్యాయి. అలాంటి సమయంలో దర్శకుడు విజయ్‌తో పరిచయమైంది. ఆయన విక్రమ్ హీరోగా తెరకెక్కించిన దైవ తిరుమగళ్ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా అమలాపాల్‌ను ఎంపిక చేశారు. ఆ తరువాత విజయ్ హీరోగా చేసిన తలైవాలోనూ అమలాపాల్‌నే హీరోయిన్‌గా నటించింది. అలా దర్శకుడు విజయ్, అమలాపాల్‌ల మధ్య పరిచయం ప్రేమగా మారి, ఆ తర్వాత పెళ్లికి దారి తీసింది. అలా 2014లో దర్శకుడు విజయ్, అమలాపాల్‌ల పెళ్లి పెద్దల సమ్మతంతో జరిగింది. అయితే పెళ్లి అయిన రెండేళ్లకే ఈ జంట విడిపోయారు.
అప్పుట్లో ఇద్దరు పరస్పర చర్చలతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు కానీ, సమస్య ఏమిటన్నది ఎవరూ చెప్పలేదు. అయితే పెళ్లి అయిన తరువాత అమలాపాల్ మళ్లీ సినిమాల్లో నటించడం మొదలెట్టింది. ఆమె నటించడం విజయ్‌కు ఇష్టం లేదని, ఈ విషయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని ప్రచారం జరిగింది. ఇదంతా జరిగి మూడేళ్లపైనే అయ్యింది. దర్శకుడు విజయ్ గత ఏడాది ఐశ్వర్య అనే వైద్యురాలిని రెండో పెళ్లి చేసుకున్నారు. అమలాపాల్ నటిగా కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు విజయ్, అమలాపాల్ విడిపోవడానికి అసలు కారణాన్ని విజయ్ తండ్రి ఏఎల్.అళగప్పన్ కుండబద్దలు కొట్టారు.
ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ వివాహానంతరం అమలాపాల్ నటించరాదని నిర్ణయించుకుందన్నారు. ఆ సమయంలో హీరో ధనుష్.. ఆమెను తను నిర్మించిన అమ్మా కణక్కు చిత్రంలో నటించేలా చేశారని చెప్పారు. ఆ చిత్ర షూటింగ్ ప్రారంభం అయిన తరువాతనే విజయ్‌కు, అమలాపాల్‌కు మధ్య సమస్యలు తలెత్తడం ప్రారంభించాయని ఏఎల్.అళగప్పన్ ఆరోపణలు చేశారు. ఇది ఇప్పుడు సినీపరిశ్రమలో కలకలానికి దారి తీసింది. కాగా అమ్మా కణక్కు తరువాత అమలాపాల్ .. ధనుష్‌తో కలిసి వేలైఇల్లా పట్టాదారి, దాని సీక్వెల్‌లోనూ వరుసగా నటించింది. కాగా ఇటీవల ఆడై చిత్రంలో నగ్నంగా నటించి సంచలనం కలిగించిన ఆమె ఆ తరువాత అదో అంద పరవై పోల చిత్రంలో నటించింది. ప్రేమికుల రోజు 14న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది.
చదవండి:
అమలాపాల్ ఇంట తీవ్ర విషాదం