గణపతి బప్పా మోరియా..గానా షురూ హో గయా!
రెండు రోజుల్లో బొజ్జ గణపయ్య కుడుములు తినడానికి రెడీ అవుతున్నాడు. కడుపు నిండా పిండి వంటలు ఆరగించి, భక్తులు పాడే పాటలకు పరవశించనున్నాడు. ఈసారి స్పెషల్ ఏంటంటే.. అమితాబ్ బచ్చన్ పాడే హారతి పాటను వినాయకుడు వినబోతున్నాడు. అమితాబ్ ఏంటి? హారతి పాట ఏంటి? అనుకుంటున్నారా? ముంబైలో సిద్ధివినాయక టెంపుల్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. చాలా ఫేమస్.
అక్కడ కొలువు దీరిన వినాయకుడి కోసం అమితాబ్ బచ్చన్ హారతి పాట పాడారు. గతంలో హనుమాన్ చాలీసా కూడా పాడారాయన. ఇప్పుడు పాడిన వినాయకుడి పాట గురించి అమితాబ్ మాట్లాడుతూ - ‘‘సిద్ధివినాయక టెంపుల్ అధికారులు ఎప్పట్నుంచో నన్ను హారతి పాట పాడమని అడుగుతున్నారు. ఈ పాట పాడటం నాకు ఆనందంగా ఉంది. దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు ఈ పాట వేస్తారా? లేక మిగతా సమయాల్లోనా? అని నేనడగలేదు. ఈ పాటకు సంబంధించిన కొంత భాగాన్ని గుడిలో చిత్రీకరిస్తాం’’ అన్నారు.
ఈ పాట వీడియో రూపంలో కూడా రానుంది. పాటను రికార్డ్ చేసేశారు కాబట్టి, ఇక చిత్రీకరించడమే ఆలస్యం. దర్శకుడు సూజిత్ సర్కార్ ఈ పాటను షూట్ చేయనున్నారు. రోహన్-వినాయక్ స్వరపరచిన ఈ పాట సీడీ రూపంలో మార్కెట్‌లోకి రానుంది. అలాగే ఇంటర్నెట్‌లో కూడా పాట లభ్యమవుతుంది. అమితాబ్ పాడిన ఈ హారతి పాట హాట్ కేక్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.