మీ సహాయం కోరుతున్నా!
‘‘మా నాన్న హరివంశ్‌రాయ్ బచ్చన్ గురించి సమగ్ర సమాచారం ప్రపంచానికి తెలియజేయాలనే ఆకాంక్షతో ఓ వెబ్‌సైట్ ఆరంభించనున్నా’’ అని అమితాబ్ బచ్చన్ ప్రకటించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఓ కారణం ఉందనీ, ఆయన గురించి పూర్తిగా తెలుసుకోకుండా కొంతమంది తప్పుడు సమాచారం ఇస్తున్నారనీ అమితాబ్ పేర్కొన్నారు. హరివంశ్ రాయ్ బచ్చన్ మంచి కవి. సాహిత్య రంగంలో తన కలం బలం ఏమిటో చూపించిన ఘనుడు. ఆయన స్మారకంగా అమితాబ్ భారీ ఎత్తున ఈ వెబ్‌సైట్‌ను ఆరంభిస్తున్నారు. ‘‘మా నాన్నగారి గురించిన చిన్నపాటి సమాచారం కానీ, ఫొటోలు కానీ మీ వద్ద ఉంటే దయచేసి మాకు పంపించండి.
ఆయన రాసిన కవితలు ఉన్నా, ఒకవేళ ఆయనకు సంబంధించిన ఉత్తరాలు ఉన్నా మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నా’’ అని అమితాబ్ ట్విట్టర్ ద్వారా విన్నవించుకున్నారు. ఇంకా ఆయన చెబుతూ -‘‘మా నాన్నగారు మంచి సాహితీవేత్త. ఆయన కోసం నేను చేస్తున్న ఈ చిరు ప్రయత్నంలో ఎలాంటి తప్పులు దొర్లకూడదని నా ఆకాంక్ష. మా నాన్న గురించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే thebachchanfamily@gmail.com అనే ఐడీకి పంపించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను’’ అన్నారు.