సాక్షి, న్యూఢిల్లీ : వారసత్వంగా తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ సాహిత్యంపై తనకు సంక్రమించిన హక్కులు 2063 తర్వాత పబ్లిక్ డొమేన్ (ప్రజల పరిధి)లోకి వెళ్లిపోతాయంటూ బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇటీవల తన బ్లాగ్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన తండ్రి హరివంశ్ రాయ్ 2003లో చనిపోయారు. దాంతో వారసత్వంగా ఆయన రాసిన నవలలు, కవితలు, వ్యాసాలపై 2063 వరకు అమితాబ్‌కు సర్వ హక్కులు లభించాయి.
1957 నాటి కాపీరైట్ హక్కుల చట్టం ప్రకారం సాహిత్యం, సంగీతం, కళలు, నాటకాలు, సినిమాలపై ఎవరికైనా 60 ఏళ్ల వరకే కాపీ రైటు ఉంటుంది. ఇంకా అమితాబ్‌కు తాను జీవించినంత కాలం కాపీరైటు హక్కులు ఉంటాయి. అయినా తన వారసులుగా ఆ హక్కులు ఉండాలని కోరుకుంటున్నట్లు ఉంది. అందుకే ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మాటకొస్తే సినిమాల పరిస్థితి మరీ దారుణం అని చెప్పవచ్చు. ఓ సినిమా తీసి 60 ఏళ్లయితే ఎవరికీ ఆ సినిమాపైనా హక్కులు ఉండవు. ఆ సినిమా ప్రజల పరిధిలోకి వెళుతుంది. అప్పుడు ఆ సినిమాలోని సన్నివేశాలనుగానీ, మాటలనుగానీ, మొత్తంగా కథనుగానీ ఎవరైనా ఉచితంగా కాపీ చేసుకోవచ్చు. ఎవరికి రాయల్టీ కింద అణా పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
ఈ లెక్కన బాలీవుడ్ హిందీ చిత్రాలనే పరిగణలోకి తీసుకున్నట్లయితే 1958 సంవత్సరానికి ముందు తీసిన అన్ని సినిమాలు ఇప్పటికే ప్రజల పరిధిలోకి వచ్చాయన్న మాట. 1941లో కమల్ అమ్రోహి తీసిన ‘మహల్’, 1951లో రాజ్‌కపూర్ తీసిన ‘ఆవారా’, 1957లో రాజ్‌కపూరే తీసిన ‘శారద’, 1958లో మెహబూబ్ ఖాన్ తీసిన మదర్ ఇండియా లాంటి చిత్రాలు, 1955లో తెలుగులో ఎల్వీ ప్రసాద్ తీసిన ‘మిస్సమ్మ’, 1951లో బీఎన్ రెడ్డి తీసిన ‘మళ్లీశ్వరి’, 1951లో కేవీ రెడ్డి తీసిన ‘పాతాళభైరవి’, 1957లో కేవీ రెడ్డి తీసిన ‘మాయాబజార్’ లాంటి ఆణిముత్యాలు ఇప్పటికే ప్రజల పరిధిలోకి వచ్చాయి. ఈ సినిమాలను రీమేక్ చేయడానికి, ఈ సినిమాల్లోని సన్నివేశాలను వాడుకునేందుకు చట్ట ప్రకారం ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్న మాట.
ఇలా కాపీ రైటు హక్కు భారత్‌లో 60 ఏళ్లు ఉండగా, అమెరికాలో 70 ఏళ్లు ఉంది. ఈ కారణంగా అమెరికాలో ఫ్రాంక్ కాప్ర, ఆర్సన్ వెల్లెస్, ఫ్రిడ్జ్ లాంగ్ చిత్రాలు పబ్లిక్ డొమేన్‌లోకి వచ్చాయి. సినిమా హాళ్లు, టీవీలే కాకుండా ఇంటర్నెట్, వెబ్‌సైట్లు లాంటి పలు రకాల ప్రసార మాధ్యమాలు వచ్చినందున 60 ఏళ్లు, 70 ఏళ్లు అంటూ కాపీరైటు ఉండరాదని సినిమా వర్గాలు ఎప్పటి నుంచో వాదిస్తున్నాయి. 60 ఏళ్ల క్రితం నడవక నష్టం వచ్చిన సినిమాకు నేడు మారిన మాధ్యంలో ఆదరణ లభించవచ్చు, డబ్బులూ రావచ్చని నిర్మాతలు అంటున్నారు. సాహిత్యంలోగానీ, కళల్లోగానీ వారసత్వంగా సంక్రమించే హక్కులు శాశ్వతంగా ఉండాలని ఆయా రంగాల వారు డిమాండ్ చేస్తున్నారు. కొత్తకొత్త మాధ్యమాలు మారుమోగుతున్న నేటి పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే చట్టం మారనూ వచ్చు!
Comments
Please login to add a commentAdd a comment