
అప్పటివరకూ కంటి మీద కునుకు రాదు!
ఈ వయసులోనూ ఇంత బిజీ బిజీగా ఎలా సినిమాలు, యాడ్స్ చేయగలుగుతున్నారు సార్?’’... అమితాబ్ బచ్చన్‌ని ఓ వ్యక్తి అడిగారు...
‘‘ఈ వయసులోనూ ఇంత బిజీ బిజీగా ఎలా సినిమాలు, యాడ్స్ చేయగలుగుతున్నారు సార్?’’... అమితాబ్ బచ్చన్‌ని ఓ వ్యక్తి అడిగారు... దానికి ఈ బిగ్ బి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ‘‘సంపాదన కోసం నేను వర్క్ చేస్తున్నాను. బతకడం కోసం అందరూ జాబ్ చేస్తున్నట్లే నేనూ చేస్తున్నా. అందులో గొప్పేం ఉంది? ఈ ఎనర్జీ ఎక్కణ్ణుంచి వస్తుందని మాత్రం అడగకండి. ఉదయం నిద్ర లేచేటప్పుడు రోజంతా ఎలా గడపాలా? అని ఆలోచించాల్సి వస్తే జీవితం బోర్ కొట్టేస్తుంది.
చేతి నిండా పనితో నా లైఫ్ బ్రహ్మాండంగా ఉంది’’ అన్నారు. ప్రస్తుతం ‘పింక్’ సక్సెస్‌ని ఆస్వాదిస్తున్నారాయన. అత్యాచారానికి గురైన అమ్మాయిల కథ చుట్టూ తిరిగే సినిమా ఇది. ఈ సినిమాకి లభిస్తున్న స్పందన గురించి అమితాబ్ మాట్లాడుతూ -‘‘పింక్ అనేది సినిమా కాదు. ఒక మూమెంట్‌లా అయిపోయింది. ఇలాంటి మంచి సినిమాకి ఆదరణ లభించడం ఆనందంగా ఉంది. దేశంలో ఆడవాళ్లకు రక్షణ లేదు.
ఈ సినిమాలో చూపించినట్లుగానే జరుగుతోంది. మా ఇంట్లో ఆడవాళ్లు రాత్రిపూట బయటికి వెళితే, వాళ్లు ఇంటికి తిరిగి వచ్చేవరకూ నాకు కంటి మీద కునుకు రాదు’’ అన్నారు. ఇదిలా ఉంటే.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తున్నారాయన. తాజాగా ఒక యాడ్ చిత్రీకరణలో పాల్గొన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఫొటో ఆ యాడ్‌కి సంబంధించినదే. వెరైటీగా బాగుంది కదూ!