అమితాబ్ సహాయం వృథా!
అమితాబ్ సహాయం వృథా!
Published Mon, Sep 9 2013 12:02 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
అమ్మ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది అంటారు. అమ్మ గొప్పతనం అది. అలాంటి అమ్మే పిల్లల పట్ల నిర్దయగా నడుచుకుంటే ఇక ఎవర్ని నమ్మాలి? రిమ్‌జిమ్, అంజలి అనే ఇద్దరు బాలికల విషయంలో ఓ అమ్మ అలానే చేసింది. విషయంలోకి వస్తే.. 2006లో తప్పుడు చిరునామా ఇచ్చి, ఇద్దరు పిల్లల్నీ ఓ స్కూల్‌లో చేర్పించింది ఆ తల్లి. ఆ తర్వాత ఆమె అదృశ్యమైంది. అప్పట్నుంచి ఆ పిల్లల ఆలనా పాలనా పాఠశాల ప్రిన్సిపాల్ చూసుకుంటున్నారు.
ఈ విషయం తెలుసుకున్న అమితాబ్‌బచ్చన్ ఆ బాలికలకు సహాయం చేయాలనుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీలో తన కోడలు ఐశ్వర్యరాయ్ పేరుతో కట్టిస్తున్న పాఠశాల శంకుస్థాపనకు ఆ బాలికలను, ప్రిన్సిపాల్‌ని ఆహ్వానించారాయన. ఇది తెలుసుకున్న బాలికల తల్లి ఈ వేడుకకు మూడురోజులు ముందే ప్రిన్సిపాల్ ముందు ప్రత్యక్షమైంది. ఇన్నాళ్లూ ఎక్కడున్నావని ప్రిన్సిపాల్ అడిగితే.. తన భర్త జైలుపాలయ్యాడని, రకరకాల సమస్యల్లో ఇరుక్కున్నానని ఓ కథ అల్లేసిందట. ఆ కథను నమ్మిన ప్రిన్సిపాల్ ఆమెను శంకుస్థాపన వేడుకకు తీసుకెళ్లి అమితాబ్‌కు పరిచయం చేయడం జరిగింది.
బాలికలిద్దర్నీ దగ్గరకు తీసుకుని, పిల్లలను బాగా చూసుకోమని చెప్పి, వాళ్ల తల్లి చేతికి రెండు లక్షల రూపాయల చెక్కు ఇచ్చారు అమితాబ్. ఆ చెక్కు తీసుకున్న ఆ మహిళ ఇదిగో వస్తానంటూ.. వెళ్లి తిరిగి రాలేదట. ఇది జరిగింది 2008లో. అప్పట్నుంచి ఆ బాలికలను ప్రిన్సిపాలే చూసుకుంటున్నారు. ఆయనకు ఇద్దరు బిడ్డలున్నారు. పైగా రిమ్‌జిమ్‌కి ఏదో అనారోగ్యం ఉందట. దాంతో ఆ ప్రిన్సిపాల్‌కి ఈ బాలికల బాధ్యత పెద్ద భారంగానే మారింది. ఏదేమైనా.. జరిగిన విషయాన్ని మాత్రం అమితాబ్ దృష్టికి తీసుకెళతానంటున్నారాయన.
Advertisement
Advertisement