ఆ నలుగురితో ఐశ్వర్య
దక్షిణాది సినిమా ప్రస్తుతం చారిత్రక చిత్రాలపై మొగ్గు చూపుతోంది. తెలుగులో రుద్రమదేవి, బాహుబలి లాంటి భారీ చారిత్రక చిత్రాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా తమిళంలో చరిత్ర కథలతో రజనీకాంత్ హీరోగా లింగ, సిద్ధార్థ్ హీరోగా కావ్య తలైవన్ చిత్రం రూపొందింది. తాజాగా బహుభాషల్లో అత్యంత భారీ బడ్జెట్ (250కోట్లు)తో ప్రముఖ హీరోలు నటించే పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతుతన్నట్లు తాజా సమాచారం.
మలయాళ ప్రముఖ రచయిత ఎం.టి.వాసుదేవన్ రచించిన రాండ ముళం అనే నవల ఆధారంగా అదే పేరుతో చిత్రంగా తెరపై ఆవిష్కరించడానికి ఇంతకుముందు ఎం.టి.వాసుదేవన్‌తో కలిసి పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన హరిహరన్ తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం రూపకల్పనపై 2011 నుంచి సుదీర్ఘ చర్చలు జరుగుతుంద గా, ఇప్పటికి కార్యరూపం దాల్చినట్లు సమాచారం. ఇది మహాభారతంలో భీముని ఇతివృత్తాన్ని ప్రధానంగా తీసుకుని రచించిన కథ అని తెలిసింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ స్టార్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ విక్రమ్, మాలీవుడ్ స్టార్ మోహన్‌లాల్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ వంటి దిగ్గజాలు నటించనున్నారని సమాచారం.
భీముడిగా మోహన్‌లాల్, భీష్మ పాత్రధారిగా అమితాబ్‌బచ్చన్, అర్జునుడిగా విక్రమ్, ద్రౌపదిగా ఐశ్వర్యారాయ్‌తో పాటు నాగార్జున మరో ముఖ్య పాత్రను పోషించనున్నారనే ప్రచారం మలయాళం, తమిళ చిత్ర పరిశ్రమలో జోరందుకుంది. తమిళం, మలయాళం, హిందీ, తెలుగు, ఆంగ్లం తదితర భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు సినీ వర్గాల టాక్. వచ్చే ఏడాది ఆగస్టులో చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిసింది.