
మెహరున్నీసా కోసం లక్నో వెళ్తున్న అమితాబ్
బాలీవుడ్ కురువృద్ధుడు, నవ యవ్వనుడు అమితాబ్ బచ్చన్ తన తదుపరి చిత్రం 'మెహరున్నీసా' షూటింగ్ కోసం లక్నో వెళ్లనున్నారు.
బాలీవుడ్ కురువృద్ధుడు, నవ యవ్వనుడు అమితాబ్ బచ్చన్ తన తదుపరి చిత్రం 'మెహరున్నీసా' షూటింగ్ కోసం లక్నో వెళ్లనున్నారు. సుధీర్ మిశ్రా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ నటిస్తున్నారు. రంజాన్ తర్వాత ఈ షూటింగ్ జరుగుతుందని చిత్ర వర్గాలు తెలిపాయి. చౌక్ ప్రాంతంలో ఈ షూటింగ్ కోసం ఓ భారీ స్టేజి ఏర్పాటుచేశారు. ఈ చిత్రంలో అమితాబ్తో పాటు రిషికపూర్, చిత్రాంగద సింగ్ లాంటి ప్రముఖ నటులు కనిపిస్తారు.
చౌక్, బడా ఇమాంబాడ, లా మాట్రినెర్ బాయెస్ కాలేజి, కాల్విన్ తాలూక్దార్ కాలేజి తదితర ప్రాంతాల్లో షూటింగ్ కోసం ఇప్పటికే అనుమతులు తీసుకున్నారు. నాలుగు దశాబ్దాల తర్వాత కలిసే ఇద్దరు స్నేహితుల కథే ఈ చిత్ర ప్రధానాంశం. 1996లో దీనికి సంబంధించిన స్క్రిప్టును సుధీర్ మిశ్రా రాసుకున్నారు. వీరిద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించి, తర్వాత విడిపోతారు. వీళ్లిద్దరూ ప్రేమించిన మహిళ పాత్రను చిత్రాంగద పోషిస్తున్నారు. వాళ్లిద్దరికీ 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఆమె వీరి జీవితంలో మళ్లీ ప్రవేశిస్తుంది. సినిమా కథ 1945లో ప్రారంభమై నాలుగు దశాబ్దాలు నడుస్తుంది. దర్శకుడు సుధీర్ మిశ్రా కూడా లక్నో వాసే. ఈ చిత్ర నిర్మాత నిఖిల్ అద్వానీ.