
హీరోయిన్ ను ప్రశ్నించిన ఎఫ్ బీఐ
లాస్ ఏంజెలెస్: హాలీవుడ్ అగ్రనటి ఏంజెలినా జోలిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్ బీఐ) అధికారులు ప్రశ్నించారు. ఏంజెలినా భర్త బ్రాడ్ పిట్ వ్యక్తిగత విమానంలో జరిగిన గొడవ గురించి ఆమెను నాలుగు గంటల పాటు ఎఫ్ బీఐ అధికారులు విచారించారు. సెప్టెంబర్ 14న మద్యం మత్తులో బ్రాడ్ పిట్ తన కుమారుడు మాడ్ డాక్స్(15)ను దుర్బలాషడాడి కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఏంజెలినా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది.
కాగా, తాము అడిగిన ప్రశ్నలకు ఏంజెలినా ఓపిగ్గా సమాధానాలిచ్చారని, విచారణకు సహకరించారని ఎఫ్ బీఐ వర్గాలు వెల్లడించాయి. ఆకాశమార్గంలో విమానంలో గొడవ జరిగినందున తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని వెల్లడించాయి. మరికొన్ని వారాల పాటు విచారణ కొనసాగే అవకాశముందని తెలిపాయి. అయితే కోర్టు కేసులకు దూరంగా ఉండాలని ఏంజెలినా, బ్రాడ్ పిట్ భావిస్తున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. తాము విడిపోతున్నామని వీరిద్దరూ ధ్రువీకరించిన సంగతి తెలిసిందే.