
వేధింపుల కేసు: నటుడికి విముక్తి
లాస్‌ఏంజిల్స్: సొంత పిల్లలనే వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలీవుడ్ టాప్ హీరో బ్రాడ్ పిట్‌కు భారీ ఊరట లభించింది. నటి ఏంజిలీనా జోలీతో విడిపోయే సందర్భంలో ఆమెపై ఉన్న కోపాన్ని బ్రాడ్ పిట్ పిల్లలపై ప్రదర్శించాడని, ప్రైవేట్ జెట్ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో చిన్నారులను వేధించాడని గత సెప్టెంబర్‌లో కేసు నమోదు అయింది.
కాగా, వేధింపులకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లభ్యమయ్యే అవకాశాలు లేకపోవడంతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష్(ఎఫ్‌బీఐ) ఈ కేసు దర్యాప్తును పూర్తిగా నిలిపేసింది. ఈ మేరకు మంగళవారం ఎఫ్‌బీఐ అధికార ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు. అటు లాస్‌ఏంజిల్స్ కౌంటీ చైల్డ్ అండ్ ఫ్యామిలీ సర్వీసెస్ శాఖ కూడా నవంబర్ మొదటివారంలోనే బ్రాడ్ పిట్‌కు ఈ కేసులో క్లీన్‌చిట్ ఇవ్వడం గమనార్హం.
12 ఏళ్ల (10 ఏళ్ల సహజీవనం, రెండేళ్ల వైవాహిక) బంధానికి ముగింపు పలుకుతూ స్టార్ కపుల్స్ ఏంజిలీనా జోలీ, బ్రాడ్ పిట్‌లు గత సెప్టెంబర్‌లో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. భర్తతో కలిసుండే విషయంలో పునరాలోచన లేదన్న జోలి.. బ్రాడ్ పిట్ పిల్లల్ని వేధించాడని ఆరోపించారు.
దీంతో ఆరుగురు పిల్లల(మాడెక్స్ జోలీ-పిట్, పాక్స్ జోలీ-పిట్, జహారా జోలీ-పిట్, షిలోహ్ జోలీ-పిట్, కవలలు కెనాక్స్ జోలీ-పిట్, వివీన్నె జోలీ-పిట్) సంరక్షణ బాధ్యత ఎవరికి అప్పగించాలనే దానిపై సందిగ్ధం నెలకొంది. ఒకదశలో పిల్లల్ని తనకే అప్పగించాలని కోర్టులో పోరాటం చేసిన బ్రాడ్ పిట్.. కొన్ని హామీల మేరకు దిగొచ్చారు. ప్రస్తుతానికి ఆరుగురు పిల్లలూ మలీబులోని ఇంట్లో తల్లి జోలీతో కలిసి ఉంటున్నారు.