తమిళసినిమా: యువ తరంగం అనిరుద్ సంగీతదర్శకుడిగా దూసుకుపోతున్నారు. తొలి చిత్రం 3తోనే వై దిస్ కొలైవెరి డీ.. అంటూ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ యువ సంగీత దర్శకుడు ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. తమిళంతో పాటు తెలుగులోనూ చిత్రాలు చేస్తూ మంచి పాపులారిటీని తెచ్చుకున్న అనిరుద్ వ్యక్తిగతంగా పలు విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే అవేవి ఆయన వృత్తికి ఆటంకాలు కాలేదు. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో యమ బిజీగా ఉన్నారు. అంతే కాదు అగ్ర నటీనటుల చిత్రాలకు సంగీతబాణీలు కడుతున్నారు. లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తున్న తాజా చిత్రం కొలమావు కోకిల చిత్రానికి అనిరుద్ అందించిన సంగీతం చర్చనీయాంశంగా మారింది. సూపర్‌స్టార్ రజినీకాంత్ కుటుంబ బంధువు అయిన ఈయనకిప్పుడు ఆయన చిత్రానికే సంగీతాన్ని అందించే అవకాశం వరించింది. ఎస్. రజనీకాంత్ తాజాగా కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించనున్న చిత్రానికి అనిరుద్ సంగీతబాణీలను కడుతున్నారు.
ఇది ఒక విశేషం అయితే తాజాగా విశ్వనటుడు కమలహాసన్ తాజా చిత్రానికి ఆ సంచలన సంగీతదర్శకుడికే సంగీతాన్ని అందించే అవకాశం వచ్చిందన్నది తాజా సమాచారం. కమల్ త్వరలో శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రజనీకాంత్ నటించిన 2.ఓ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేస్తూనే మరో పక్క కమలహాసన్ ఇండియన్–2 చిత్ర ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం జెంటిల్‌మెన్ నుంచి ఐ చిత్రం వరకూ ఏఆర్.రెహ్మాన్‌నే సంగీతాన్ని అందించారు. మధ్యలో అనియన్, నన్భన్ చిత్రాలకు మాత్రం హారీష్ జయరాజ్ సంగీతాన్ని అందించారు. తాజాగా ఇండియన్ 2 చిత్రంతో కలిపి మూడో చిత్రానికి ఇతర సంగీత దర్శకుడు పనిచేస్తున్నారన్న మాట.
ఇండియన్–2 చిత్రానికి కమిట్ అయిన అనిరుద్‌ను దర్శకుడు శంకర్ ఒకే ఒక్క విషయం చెప్పారట. కొలమావు కోకిల చిత్ర సంగీత చర్చనీయాంశంగా మారిన తరుణంలో తన చిత్రానికి సంగీతాన్ని అందించే విషయంలో చాలా శ్రద్ధగా ఉండాలని సూచించారట. అంటే తన చిత్రానికి ఒరిజనల్ సంగీతం కావాలన్న భావాన్ని వ్యక్తం చేశారట. మరి ఈ రెండు దిగ్గజాల చిత్రాలతో అనిరుద్ తన సత్తాను ఎలా చాటుకుంటారో చూడాలి. ఏదేమైనా అనిరుద్ ఇప్పుడు స్టార్ సంగీతదర్శకుల పట్టికలో చేరిపోయారన్న మాట.
Comments
Please login to add a commentAdd a comment