
యువ సంగీత దర్శకుడు అనిరుద్, దర్శకుడు పొన్ముడి
పెరంబూరు: యువ సంగీత దర్శకుడు అనిరుద్ పాడడానికి నో అనడంతో దర్శకుడు ప్రాణానికి ముప్పు తెచ్చి పెట్టింది. వివరాలు చూస్తే పయ్యా, పచ్చాంకై చిత్రాల్లో విలన్ పాత్రల్లో నటించిన పొన్ముడి దర్శకుడిగా మారి సోమపాన రూప సుందరన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మెర్లిన్ చిత్రం ఫేమ్ విష్ణుప్రియన్ హీరోగా నటిస్తున్న ఇందులో బిగ్‌బాస్ గేమ్ షో ఫేమ్ ఐశ్వర్యదత్తా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌లో ఉండగానే నటి ఐశ్వర్యదత్ బిగ్‌బాస్ గేమ్ షోకి వెళ్లడంతో షూటింగ్‌కు సమస్యలు ఎదురయ్యాయి. ఇలాంటి తరుణంలో చిత్రంలో ఒక పాటను సంగీత దర్శకుడు అనిరుద్‌తో పాడించే ప్రయత్నాలు చేశారు. అయితే ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా పాడలేనని చెప్పారు.
దీంతో సోమపాన రూప సుందరన్ చిత్ర దర్శక నిర్మాతల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. తమ చిత్రంలో అనిరుద్ పాడనన్నందుకు మనస్తాపం చెందిన దర్శకుడు పొన్ముడి అధిక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆయన సహాయ దర్శకులు వెంటనే ఆస్పత్రిలో చేర్చడంతో పొన్ముడి ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. ప్రస్తుతం బెడ్ రెస్ట్‌లో ఉన్న ఆయన ఈ సంఘటన గురించి తెలుపుతూ అనిరుద్‌ను తమ చిత్రంలో పాడిస్తానని సంగీత దర్శకుడు అబ్బాస్ రఫీ మాట ఇవ్వడంతో తాము చిత్ర షూటింగ్‌కు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఆయన కుదరదు అనడంతో చిత్ర నిర్మాణ పనులు నిలిచిపోయాయని చెప్పారు. దీంతో మనస్తాపానికి చెందిన తాను ఆత్మహత్నానికి పాల్పడినట్లు తెలిపారు. అయితే తన అసిస్టెంట్స్ తనను కాపాడారని చెప్పారు. అయినా ఇప్పుటికీ తన పరిస్థితి సీరియస్‌గానే ఉందని, ఈ సమస్యకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుందో తెలియడం లేదనే ఆవేదనను దర్శకుడు పొన్ముడి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment