ఆర్. నారాయణమూర్తి
ఆర్. నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘అన్నదాత సుఖీభవ’. సెప్టెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులకు ‘అన్నదాత సుఖీభవ’ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు ఆర్. నారాయణమూర్తి. చిత్రాన్ని వీక్షించిన అనంతరం ప్రముఖులు ఈ విధంగా స్పందించారు.
నగలు తాకట్టు పెట్టానన్నాడు: కోడి రామకృష్ణ
ప్రతి రైతు, ప్రతి విద్యార్థి, ప్రతి టీచర్, ప్రతి రాజకీయ నాయకుడు.. ముఖ్యంగా మన భారత ప్రధాని ఈ సినిమా చూడాలి. సినిమా చూస్తున్నప్పుడు మనం రైతులను వెంటనే కాపాడాలనే ధైర్యం, ఆత్రుత కలిగాయి. నాకు కౌలు రైతులున్నారు. వారు నా దగ్గరికి కౌలు డబ్బులు ఇవ్వటానికి వచ్చినప్పుడల్లా ఈసారి గిట్టుబాటు ధర రానందున మా ఆవిడ నగలు తాకట్టు పెట్టి తెచ్చానండి అనేవాడు. మరో రైతు మా అబ్బాయి స్కూల్ ఫీజు కట్టలేదన్నాడు. ఇలా చెబుతున్నప్పుడు ఇప్పుడు మనం ఈ డబ్బులు తీసుకోవాలా, అలా తీసుకుంటే మనం రాక్షసులం అనే ఫీలింగ్ వచ్చేది నాకు. అందుకే నాలా ప్రతి ఒక్కరూ ఫీల్ అవ్వండి. పంటలు పండించే రైతును మనం సానుభూతితో చూద్దాం.
రైతు లేనిదే దేశం లేదు: ముత్యాల సుబ్బయ్య
ఈ చిత్రంలో ప్రతి పాటా మెసేజ్ ఓరియంటెడ్‌గా ఉంది. రైతు లేనిదే దేశం లేదు. గ్రామాలనుండి, పట్టణాల వరకు రైతు ప్రాముఖ్యతను తెలియజేస్తూ, రైతుల డిమాండ్‌ను పాలకులు పట్టించుకోకపోతే తిరగబడి రైతులందరూ సమ్మె చేస్తే.. ఈ సినిమాకు ఇది అద్భుతమైన ఫినిషింగ్.
కల్తీ గురించి బాగా చూపించారు: కోదండ రామిరెడ్డి
ప్రతిరోజు అందరం వింటున్నాం. పాలల్లో కల్తీ, నూనెల్లో కల్తీ, విత్తనాల్లో కల్తీ.. ఇలా ప్రతిదీ కల్తీనే. దీని గురించి సినిమాలో బాగా చూపించారు.
ప్రతి సమస్యను చర్చించారు: తమ్మారెడ్డి భరధ్వాజ
ఈ చిత్రంలో రైతుకి ఉండే ప్రతి సమస్యను చర్చించారు. వాటి పరిష్కార మార్గాల్ని చూపించారు. ఇంత ధైర్యంగా సినిమా తీసినోడు ఎవరూ లేరు. మంచి సినిమా తీశారు. ఈ సినిమా అందరూ చూడాలని.. చూస్తారని ఆశిస్తున్నా.
ఆత్మహత్యలు లేని రైతు రాజ్యం రావాలి: యన్.శంకర్
ఇప్పుడున్న జనరేషన్‌కి వాళ్లు తింటున్న అన్నం ఎక్కడి నుండి వస్తుంది? అదెక్కడ పుడుతుంది? ఎవరు పుట్టిస్తారు అనేది తెలియదు. ఈ సినిమాను ఈ జనరేషన్ పిల్లలు చూడాలి. ఆత్మహత్యలు లేని రైతు రాజ్యం రావాలని, రైతు ఇంట్లో సంబంధం అంటే ఎంత గౌరవంగా ఉంటుందో అనే విధంగా సమాజంలో మార్పు రావాలని కోరుకుంటున్నా.
రైతు సమస్యకు పరిష్కారం లేదు: ధవళ సత్యం
ఈ దేశానికి కొరుకుడు పడని సమస్య రైతు సమస్య. ఆ సమస్యలకు పరిష్కారం లేనివాడు రైతే. రైతులందరూ ఈ సినిమా చూసి నేర్చుకోవాలి. తను పండించిన పంట గిట్టుబాటు ధర రానందుకు ఆత్మహత్య తప్ప వేరే మార్గమే లేదు అనుకునే సమయంలో ఒక రైతు ‘తిరగ బడదాం, గిట్టుబాటు ధర కోసం.. పోరుబాట చేద్దాం’ అనేదే ఈ చిత్రకథ.
ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ కమిటీ ఏం సిఫారసు చేసిందంటే.. రైతు పండించే పంటకు, ఉత్పత్తి అయ్యే ఖర్చు ఏమైతే ఉందో, ఆ రైతు శ్రమ, రైతు కుటుంబ శ్రమ, పెట్టుబడి, వడ్డీ, కౌలు సమస్తం పోను అదనంగా 50 శాతం లాభం ఇవ్వాలి. దానిని ఇంప్లిమెంట్ చేయాలని ఈ ‘అన్నదాత సుఖీభవ’ చిత్రం ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాను’’ అన్నారు.
ఇంకా ఈ చిత్రాన్ని వీక్షించిన దర్శకులు రేలంగి నరసింహారావు, వైవీయస్ చౌదరి, వీర శంకర్, రాంప్రసాద్, దేవీ ప్రసాద్, సంగీతం దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తదితరులు ‘‘అన్నదాత సుఖీభవ’ అందరూ చూడాల్సిన సినిమా’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment