సినిమా: ఏ రంగంలోనైనా, ఎంత ప్రతిభ ఉన్నా, అదృష్టం చాలా ముఖ్యం. ఇప్పుడు తమ వృత్తుల్లో రాణిస్తున్న వారంతా ప్రతిభావంతులని, ఇతరుల్లో ప్రతిభ లేదని చెప్పలేం. సినిమారంగంలోకి వస్తే నటి సమంత, జ్యోతిక లాంటి తమ కంటే ప్రతిభావంతులు చాలా మంది ఉన్నారన్న విషయాన్ని చాలా సార్లు బహిరంగంగానే వెల్లడించారు. నటి అనుపమాపరమేశ్వరన్ పరిస్థితి ఇక్కడ ఇదే. ఈ మలయాళ కుట్టి ప్రేమమ్ వంటి హిట్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత కోలీవుడ్, టాలీవుడ్ భాషల్లోనూ అవకాశాలు వరించాయి. అలా తమిళంలో ధనుష్ వంటి స్టార్ హీరోతో కొడి చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ చిత్రం బాగానే ఆడింది. అయితే ఆ తరువాత ఈ అమ్మడికి కోలీవుడ్‌లో ఒక్కటంటే ఒక్క అవకాశం రాలేదు. ఇక తెలుగులో మాత్రం అవకాశాలు వరుస కడుతున్నాయి. అలాంటిది చాలా కాలం తరువాత తమిళంలో రెండో అవకాశం వచ్చింది. దీంతో ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది.
ఆ వివరాలు చూద్దాం. తెలుగులో నాని, నివేదాథామస్ కలిసి నటించిన చిత్రం నిన్నుకోరి. ఈ చిత్రం అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఆ చిత్రం ఇప్పుడు తమిళంలో రీమేక్ అవుతోంది. లక్కీగా ఇందులో నటి అనుపమపరమేశ్వరన్ నాయకిగా నటించే అవకాశం వరించింది. అధర్వ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో నటించడం గురించి నటి అనుపమపరమేశ్వరన్ మాట్లాడుతూ కొడి చిత్రం తరువాత తమిళంలో మంచి అవకాశం రాలేదని చెప్పింది. ఇన్నాళ్లకు నిన్నుకోరి రీమేక్‌లో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని అంది. ఎందుకంటే ఇందులో కథానాయకి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్పింది. అయితే తెలుగులో నటి నివేదాథామస్ చాలా బాగా నటించిందని, ఆ పాత్రలో తానెలా నటించినా ఆమెతో పోల్చరాదని అంది. తనదైన స్టైల్‌లో తాను నటించినట్లు తెలిపింది. ఇందులో తాను భరత నాట్య కళాకారిణిగా నటిస్తున్నట్లు చెప్పింది. క్లాసికల్ డాన్స్‌ను నేర్చుకున్న తనకు ఈ చిత్రంలోని పాత్ర ప్లస్ అవుతుందని భావిస్తున్నానని అంది. పాత్రలో ఎమోషనల్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయని వాటిని అర్థం చేసుకుని నటిస్తున్నట్లు అనుపమా పరమేశ్వరన్ చెప్పింది. చూద్దాం ఈ చిత్రం అయినా ఈ భామను కోలీవుడ్‌లో నిలబెడుతుందేమో.
Comments
Please login to add a commentAdd a comment