సిల్వర్ స్క్రీన్‌పై మెరుపులా మెరవడానికి మెరుపు తీగల్లాంటి కథానాయికలు జోరుగా హుషారుగా సినిమాలు చేస్తుంటారు. ఒకే ఏడాది మూడు ఆపై ఎక్కువసార్లు తెరపై మెరిసే చాన్స్ వస్తే వాళ్ల ఆనందం పట్టలేనంతగా ఉంటుంది. ఈ ఏడాది అలా మినిమమ్ మూడు చిత్రాలతో తెలుగులో మెరిసి, కెరీర్ బాగున్నందుకు మురిసిపొయిన కథానాయికల గురించి తెలుసుకుందాం.
2024లో తెలుగు తెరపై మీనాక్షీ చౌదరి హవా కనిపించింది. మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’, దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’, వరుణ్ తేజ్ ‘మట్కా’, విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ చిత్రాలతో మీనాక్షీ చౌదరి వెండితెరపై కనిపించారు. అంతేనా... తమిళ హీరో విజయ్ ‘గోట్: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ తెలుగులో అనువాదమై, ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోనూ ఓ లీడ్ రోల్ చేశారు మీనాక్షి. ‘లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ’ చిత్రాలు నెల రోజుల గ్యాప్‌లో విడుదల కావడం విశేషం. ఇక ‘గుంటూరు కారం, లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ, గోట్’ చిత్రాలు హిట్స్‌గా నిలిచాయి.
మరోవైపు తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల ఈ ఏడాది మంచి జోరు కనబరిచారు. హారర్ మూవీ ‘తంత్ర’లో లీడ్ రోల్ చేసి, రూరల్ యాక్షన్ ఫిల్మ్ ‘΄÷ట్టేల్’లో గృహిణిగా భావోద్వేగభరితమైన పాత్ర చేశారు. ప్రియదర్శి–నభా నటేష్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘డార్లింగ్’లోనూ డాక్టర్‌గా ఓ లీడ్ రోల్ చేశారీ బ్యూటీ. అలాగే నేడు విడుదలవుతోన్న ‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్’ చిత్రంలోనూ ఓ లీడ్ చేశారు. ఇలా అనన్య ఈ ఏడాది నాలుగుసార్లు ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లవుతుంది. ఇక ముంబై బ్యూటీ కావ్యా థాపర్ కూడా తెలుగు ప్రేక్షకులను ఈ ఏడాది తరచూ పలకరిస్తూ వచ్చారు.
రవితేజ ‘ఈగిల్’, సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన, రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’, గోపీచంద్ ‘విశ్వం’ చిత్రాల్లో కావ్యా థాపర్ కనిపించారు. ఓ మంచి కమర్షియల్ హీరోయిన్‌గా ఈ ఏడాది తెలుగు ఆడియన్స్‌ను అలరించారు కావ్యా థాపర్. మరోవైపు హీరోయిన్‌గా పరిచయమైన తొలి ఏడాదే మూడు సినిమాలతో సత్తా చాటారు యువ హీరోయిన్ నయన్ సారిక. ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’, నార్నే నితిన్ ‘ఆయ్’, కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రాల్లో హీరోయిన్‌గా చేశారీ బ్యూటీ.
నయన్ చేసిన ఈ మూడు చిత్రాలకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం ఆమె కెరీర్‌కు బలం చేకూరినట్లయింది. ఇక హీరోయిన్‌గా కాదు కానీ... కథను ఇంపాక్ట్ చేసే పాత్రల్లో రుహానీ శర్మ కనిపించారు. వెంకటేశ్ ‘సైంధవ్’, వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’, సుహాస్ ‘శ్రీరంగనీతులు’ చిత్రాల్లో రుహానీ మంచి పాత్రలు చేశారు. ‘లవ్ మీ’ చిత్రంలో ఓ చిన్న గెస్ట్ రోల్‌లో కూడా కనిపించారు రుహానీ. ఇలా ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను తరచూ పలకరించిన మరికొంతమంది హీరోయిన్లు ఉన్నారు.
విలన్‌గానూ విజృంభించారు
సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు స్క్వేర్’లో స్పై ఏజెంట్ లిల్లీ జోసెఫ్‌గా, రవితేజ ‘ఈగిల్’లో జర్నలిస్ట్ నలినీ రావుగా కనిపించారు అనుపమా పరమేశ్వరన్. అయితే ‘డీజే టిల్లు 2’లో కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అనుపమ నటించడం విశేషం. ఈ తరహాలోనే మరో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ తొలిసారి నెగటివ్ షేడ్స్ ఉన్న అప్సర ఆలియాస్ మాయ పాత్రను విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ సిని మాలో చేశారు. ఈ బ్యూటీయే వెంకటేశ్ ‘సైంధవ్’లో మనోజ్ఞ అనే సెంటిమెంట్ రోల్‌లో కనిపించడం విశేషం. మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’లో హీరోయిన్‌గా చేసిన శ్రీలీల, అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’లో స్పెషల్ సాంగ్ ‘కిస్సిక్’లో మెరిశారు. ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది తెలుగులో రష్మిక కనిపించిన చిత్రం ఇదొక్కటే. విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’తో మృణాల్ ఠాకూర్ (‘కల్కి 2898 ఏడీ’లో ఓ గెస్ట్ రోల్ చేశారు), శర్వానంద్ ‘మనమే’లో ఐటీ ఉద్యోగిగా కృతీ శెట్టి, ఫ్యామిలీ డ్రామా ‘35: చిన్న కథ కాదు’లో గృహిణి సరస్వతిగా నివేదా థామస్‌ల నుంచి ఈ ఏడాది ఒక్క చిత్రమే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన అనుష్క, సమంత, సాయి పల్లవి, పూజా హెగ్డే, కీర్తీ సురేష్ వంటి హీరోయిన్లు ఇతర భాషల చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల ఈ ఏడాది తెలుగులో కనిపించలేదు. ఇక ఈ ఏడాది దీపికా పదుకోన్, భాగ్యశ్రీ భోర్సే, రుక్మిణీ వసంత్... ఇలా దాదాపు 20మంది హీరోయిన్లు తెలుగుకు పరిచయం అయ్యారు. – ముసిమి శివాంజనేయులు
Comments
Please login to add a commentAdd a comment