
టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మల వివాహ బంధానికి రెండేళ్లు పూర్తి అయింది. నేడు (డిసెంబర్ 11) విరాట్-అనుష్క శర్మలు రెండో పెళ్లిరోజు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న అత్యంత అందమైన కపుల్స్‌లో ఈ జంట కూడా ఒకటి. ఈ జంట సోషల్ మీడియాలో వారి ప్రేమను సరదా ట్వీట్లు, ఫోటోలు షేర్ చేస్తూ వ్యక్తపరుస్తుంటారు. తాజాగా ఈ జంట తమ రెండో వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ.. పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనుష్క శర్మ తను పోస్ట్ చేసిన ఫోటోకు..‘ ‘ఒక వ్యక్తిని ప్రేమించటం అంటే దేవుని ముఖాన్ని చూడటం’ అని చెప్పిన విక్టర్ హ్యూగో కొటేషన్‌ను పెట్టారు. అదేవిధంగా ‘ప్రేమ అనేది ఒక అనుభూతి మాత్రమే కాదు. దాని కంటే ఎక్కువ.. ప్రేమ ఒక గైడ్, సంపూర్ణ సత్యానికి మార్గం ’ అని కామెంట్ చేశారు. తాను అందరి చేత ఆశీర్వదించబడ్డానని అనుష్కశర్మ తెలిపారు.
దీనికి స్పందించిన విరాట్ కూడా తమ వివాహనికి సంబంధించిన ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అదే విధంగా ‘ప్రేమ మాత్రమే వాస్తవం. దాన్ని మించినది మరేది లేదు. మీకు అర్థమయ్యే వ్యక్తితో దేవుడు మిమ్మల్ని జతగా కలిపి ఆశీర్వదించాడు’ అని విరాట్ కామెంట్ చేశారు. అభిమానులు వీరిద్దరి జోడీని ముద్దుగా ‘విరుష్క’ అని పిలుస్తారన్న విషయం తెలిసిందే.
వీరు ఇద్దరు మొదటి వివాహ వార్షికోత్సవానికి కూడా తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ‘పెళ్లై ఏడాది గడిచిందంటే నమ్మలేకపోతున్నా... నిన్ననే వివాహమైనట్లు అనిపిస్తుంది. నా ప్రియతమ స్నేహితురాలికి.. నా భాగస్వామికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఎప్పటికీ నువ్వు నాదానివే’ అని విరాట్ ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. దానికి స్పందించిన అనుష్క శర్మ ‘కాలం గడిచిపోతుందని తెలియట్లేదంటే అంతకు మించిన స్వర్గం మరొకటి లేదు. ఓ మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోటం కంటే మించిన స్వర్గం మరొకటి లేదు’ అని ట్వీటర్‌లో కామెంట్ చేశారు. ఈ జంట ట్వీట్లకు క్రికెట్ అభిమానులు మాత్రమే కాదు.. నెటిజన్లు అందరూ ఫిదా అయిన విషయం తెలిసిందే. ఈ జంట 2017 డిసెంబర్ 11న వివాహబంధంతో ఒకటైన సంగతి తెలిసిందే.