ఈ పండగ నెలంతా ఇక్కడే!
సంవత్సరం పొడవునా ఎక్కడైనా ఉండనివ్వండి.. రంజాన్ మాసంలో మాత్రం ఎ.ఆర్. రెహమాన్ భారతదేశంలోనే ఉంటారు. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ చిత్రాల పని మీద విదేశాల్లో ఉన్న రెహమాన్ స్వదేశం వచ్చారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉందని రహమన్ చెబుతూ -‘‘ఏ పండగని అయినా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటేనే తృప్తిగా ఉంటుంది. నేనెంత బిజీగా ఉన్నా రంజాన్ మాసంలో మాత్రం చెన్నయ్‌లో ఉండేలా ప్లాన్ చేసుకుంటా. ముఖ్యంగా ఉపవాస దీక్ష చేయడానికి మన భారతదేశమే అనువుగా ఉంటుంది. ఈ పవిత్ర దినాల్లో అమ్మ, నా భార్యా, పిల్లలతో కలిసి ఉండటం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు.
ప్రస్తుతం చేస్తున్న చిత్రాలకు పాటలు సమకూర్చడంతో పాటు తను నిర్వహిస్తున్న ‘కెఎం’ స్కూల్‌కెళ్లి, అక్కడి స్టూడెంట్స్‌ని కలిశారు రెహమాన్. ‘‘ఆ దేవుడి దయ వల్ల కళాశాల స్థాయికి చేరుకుంది మా పాఠశాల. ఇక్కడున్న ప్రతి విద్యార్థీ మాకెంతో ముఖ్యం. అందరూ ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా ఆకాంక్ష. ఈ మ్యూజిక్ అకాడమీ ఎలా నడుస్తుందో అనే దిగులు నాకు లేదు. ఎందుకంటే, నా సోదరి దగ్గరుండి చూసుకుంటుంది’’ అని చెప్పారు రెహమాన్. ప్రస్తుతం ఓ చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారాయన. దీనికి సంబంధించిన కథ కూడా సిద్ధమైంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభిస్తామని చెప్పారు రెహమాన్. భవిష్యత్తులో దర్శకత్వం కూడా చేస్తారా? అనడిగితే.. ఆ ఉద్దేశమే లేదని పేర్కొన్నారు.