సిన్సియర్ పోలీసాఫీసర్‌గా ‘అర్జున్ ఐపీఎస్’
నీతి నిజాయతీకి మారుపేరుగా నిలిచే పోలీసాఫీసర్‌గా అర్జున్ నటించిన తమిళ చిత్రం ‘మాసి’ తెలుగులో విడుదల కానుంది. డ్రీమ్స్ యానిమేషన్ ప్రై. లిమిటెడ్ సమర్పణలో శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా తమటం కుమార్‌రెడ్డి అందించనున్నారు.
‘అర్జున్ ఐపీఎస్’ పేరుతో ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలో పాటలను, సెప్టెంబర్‌లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘అర్జున్ చేసిన పోలీసాఫీసర్ పాత్ర అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది.
తమిళంలో పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కిచ్చా ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఘంటసాల రత్నకుమార్ పదునైన సంభాషణలందించారు’’ అని చెప్పారు. అర్జున్ సరసన అర్చనాగుప్త కథానాయికగా నటించిన ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, ప్రదీప్ రావత్, పొన్నాంబలం తదితరులు ఇతర పాత్రలు చేశారు.