జోడీ కుదిరింది
ఓ పదేళ్ల క్రితం అందంగా ఉన్న కుర్రాళ్లను అరవింద్ స్వామిలా ఉన్నావనేవారు. ‘దళపతి’, ‘రోజా’, ‘బొంబాయి’ వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఆ తర్వాత వ్యాపారంపై దృష్టి సారించిన అరవింద్ స్వామి దశాబ్దం తర్వాత మణిరత్నం ‘కడలి’తో రీ-ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘తని ఒరువన్’లో విలన్‌గా అందర్నీ మెప్పించారు. ఆ సినిమా తెలుగు రీమేక్ రామ్‌చరణ్ ‘ధృవ’లోనూ ఆయనే విలన్‌గా నటిస్తున్నారు. ఇప్పుడు అరవింద్ స్వామి హీరోగా రీ-ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు.
‘సదురంగ వెట్టై’ అనే తమిళ సినిమా సీక్వెల్‌లో ఆయన హీరోగా నటించనున్నారు. అరవింద్ స్వామికి జోడీగా త్రిషను ఎంపిక చేశారు. 2014లో విడుదలైన ‘సదురంగ వెట్టై’తో హెచ్.వినోద్ దర్శకుడిగా పరిచయమయ్యారు. సీక్వెల్‌కి ఆయనే కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ‘సలీమ్’ ఫేమ్ నిర్మల్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. టెక్నాలజీ ఉపయోగించి ఓ ఘరానా మోసగాడు ఏం చేశాడనే కథాంశంతో ఈ థ్రిల్లర్ మూవీ తెరకెక్కనుందట. త్వరలో షూటింగ్ మొదలు కానుంది.