లాఠీ పట్టనున్న సిమ్రాన్..!
జస్ట్ టెన్ ఇయర్స్ వెనక్కి వెళితే... అప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేసిన తారల్లో సిమ్రాన్ గుర్తుకు మానరు. అటు నార్త్, ఇటు సౌత్‌లో కలిపి ఇప్పటివరకూ ఆమె కథానాయికగా చేసిన చిత్రాలు 70పైనే ఉంటాయి. అతిథి పాత్రలతో కలుపుకుంటే దాదాపు 85 సినిమాలుంటాయి. ఈ 85 సినిమాల్లో 18 సినిమాల్లో సిమ్రాన్ గెస్ట్ రోల్స్ చేశారు. 2003లో దీపక్‌ని పెళ్లి చేసుకున్నాక స్లో అయ్యారామె. ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో నాయికగా చేసినా అవి అంతగా క్లిక్ కాలేదు. అందుకే మనసుకు నచ్చిన గెస్ట్ రోల్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నారు.
ఆ విధంగా గడచిన నాలుగేళ్లల్లో తమిళంలో ఆమె నాలుగు గెస్ట్ రోల్స్ చేశారు. ఇప్పుడు ఐదో గెస్ట్ రోల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘రోజా’ ఫేం అరవింద్ స్వామి హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సిమ్రాన్ పోలీస్ గెటప్‌లో కనిపించనున్నారు. సిమ్రాన్ పోలీస్ పాత్ర చేయడం ఈ చిత్రానికి ఎక్స్‌ట్రా మైలేజ్ ఇస్తుందని చిత్రబృందం అంటోంది. ఇది పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర అట. మేజిక్ బాక్స్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రానికి సెల్వా దర్శకత్వం వహించనున్నారు. రితిక హీరోయిన్‌గా ఎంపికైంది. టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. ఆ సంగతలా ఉంచితే.. ఎప్పటి నుంచో నిర్మాతగా మారాలని సిమ్రాన్ అనుకుంటున్నారు. ఈ ఏడాది ఆ కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నారట.