రేపు ప్రేక్షకులకు వద్దకు ఆరడుగుల బుల్లెట్!
తొలి మూడు రోజుల్లోనే ఇంటర్నెట్ లో పదిలక్షలకు పైగా హిట్స్ తో ఫస్ట్ లుక్, టీజర్స్ తో సంచలనం సృష్టించిన అత్తారింటికి దారేది చిత్రం సెప్టెంబర్ 27 తేదిన విడుదలకు సిద్ధమవుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమం ఎఫ్టెక్ట్ తో విడుదల వాయిదా పడిన అత్తారింటికి దారేది చిత్రం పైరసీ సీడీలు కృష్ణా జిల్లా పెడన లో బయటపడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఈ చిత్రం తొలుత అక్టోబర్ 9 తేదిన దసరా కానుకగా విడుదల చేయాలని భావించినా.. పైరసీ ఎఫెక్ట్ తో విడుదలను ముందుగానే ప్లాన్ చేశారు. జల్సా చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్, రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
తన తాత కోరిక తేర్చేందుకు విదేశాల నుంచి గౌతమ్ నందా (పవన్ కళ్యాణ్) హైదరాబాద్ కు చేరుకుంటారు. అయితే తాత కోరిక ఏంటి? యూరప్ లో ఉండే తాత కోరికకు హైదరాబాద్ లింకేమిటి అనే ప్రశ్నలకు సమాధానం కోసం శుక్రవారం విడుదల అవుతున్న అత్తారింటికి దారేది చిత్రం చూడాల్సిందే. ఈ చిత్రంలో శశి పాత్రలో సమంతా, ఇతర పాత్రల్లో ప్రణీత, బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ, నదియా, ఆలీ, కోట శ్రీనివాసరావు(సిద్దప్ప), ప్రత్యేక పాత్రలో హంస నందిని, ముంతాజ్ లు నటిస్తున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అభిమానుల్లో కిర్రాక్ రేపింది. ఆడియోలో పవన్ కళ్యాణ్ పాడిన 'కటమ రాయుడా', విజయ్ ప్రకాశ్, ఎంఎల్ఆర్ కార్తీకేయన్ పాడిన 'ఆరడుగుల బుల్లెట్', దేవి శ్రీ ప్రసాద్ పాడిన 'నిన్ను చూడగానే', దేవ దేవం(పలక్కడ్ శ్రీరాం, రీటా), బాపు గారి బొమ్మో (శంకర్ మహదేవన్), కిర్రాక్ (నరేంద్ర, డేవిడ్ సైమన్స్), టైమ్ టూ పార్టీ (డేవిడ్ సైమన్, మాల్గుడి శుభ) పాటలకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. అత్తారింటికి దారేది చిత్రం 55 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందింది. అయితే రికార్డు స్థాయిలో ఓవర్సీస్ రైట్స్ 7.5 కోట్లకు, శాటిలైట్ రైట్స్ 9 కోట్లకు అమ్ముడైనట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ చిత్రానికి నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్.