అభిమానానికి అదిరిపోయే ఫేర్‌ వెల్‌ | avengers endgame review | Sakshi
Sakshi News home page

అభిమానానికి అదిరిపోయే ఫేర్‌ వెల్‌

Apr 27 2019 12:11 AM | Updated on Apr 27 2019 12:11 AM

avengers endgame review - Sakshi

అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌ పోస్టర్‌

ఏదైనా బంధంలో బాధాకరమైన విషయం ఏంటంటే అది ఆ బంధానికి ముగింపు. అది కచ్చితంగా డైరెక్ట్‌ రిలేషనే కానక్కర్లేదు. సినిమాల్లో మనకు నచ్చిన పాత్రతో మనం పెంచుకున్న ఇష్టం కూడా ఓ బంధమే. మరి ఆ పాత్రలు అంతమౌతున్నప్పుడు, తిరిగి రావని తెలిసినప్పుడు బాధ అనివార్యం. ప్రస్తుతం అలాంటి పెయిన్‌లోనే ఉన్నారు ‘అవెంజర్స్‌’ అభిమానులు. కారణం ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ తర్వాత తమ అభిమాన సూపర్‌ హీరోలు మళ్లీ రాకపోవడమే.

‘మార్వెల్‌ కామిక్స్‌’ ఆధారంగా 2008లో మార్వెల్‌ సినీ ప్రయాణం మొదలైంది. మార్వెల్‌ మొదటి సినిమా ‘ఐరన్‌ మేన్‌’. ఆ తర్వాత ఈ కామిక్‌ బుక్‌ ఆధారంగా సూపర్‌ హీరోల సినిమాలు వచ్చాయి.  ఈ పదేళ్లలో 21 సూపర్‌ హీరోల సినిమాలను నిర్మించింది మార్వెల్‌ స్టూడియోస్‌. ఈ ప్రాసెస్‌లో ప్రపంచవ్యాప్తంగా అభిమాన సామ్రాజ్యాన్నే నిర్మించిందనడంలో అతిశయోక్తి లేదు. ఈ పదేళ్లలో సృష్టింపబడ్డ సూపర్‌ హీరోలందరికీ గుడ్‌బై చెప్పే తరుణం వచ్చింది. ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’ సినిమాతో సూపర్‌ హీరోలకు టాటా చెప్పనుంది మార్వెల్‌ సంస్థ.  చిటికేసి సూపర్‌ హీరోలనే మాయం చేయగల పవర్‌ఫుల్‌ విలన్‌ థానోస్‌తో అవెంజర్స్‌ ఎలా తలపడ్డారు? విజయం సాధించారా? లేదా? అన్నదే ‘ఎండ్‌ గేమ్‌’ కథ. రుస్సో బ్రదర్స్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా దేశవ్యాప్తంగా శుక్రవారం రిలీజ్‌ అయింది.


సినిమాలో ఒక్క సూపర్‌ హీరో ఉంటేనే వీఎఫ్‌ఎక్స్‌ విధ్వంసం జరుగుతుంది. అలాంటిది అరడజను మందికి పైగా ఉంటే? అందులోనూ (ఐరన్‌మేన్, కెప్టెన్‌ అమెరికా, బ్లాక్‌ విడో, థార్‌) సూపర్‌ హీరో పాత్రలకు ముగింపు పలికే సినిమా అంటే ఎలా ఉండాలి?  కేవలం ఒక్క సినిమాగా చూసి సంతృప్తి కలిగించేలా కాదు.. పదేళ్లుగా ఏర్పడ్డ అభిమానాన్ని, జ్ఞాపకాల్ని సంతృప్తిపరచాలి. అంచనాలు ఆకాశాన్ని మించిపోయాయి. అద్భుతమైన కథ, కథనం, గ్రాఫిక్స్‌ సాయంతో రుస్సో బ్రదర్స్‌ ఆ ఫీట్‌ను ఈజీగా అందుకోగలిగారు అని చెపొచ్చు. 

మూడు గంటలు ఊపిరి సలపని యాక్షన్, సర్‌ప్రైజ్‌లు, ట్విస్ట్‌లు, కంట తడి పెట్టించే సన్నివేశాల కలయికే ‘ఎండ్‌ గేమ్‌’.  ఇంత మంది సూపర్‌ హీరోలున్నప్పుడు నిడివిలో యాక్షన్, స్క్రీన్‌ టైమ్‌లో వాటాల దగ్గర వాగ్వివాదాలు రావచ్చు. ప్రతి క్యారెక్టర్‌కు ఊపిరి పిల్చుకునే స్పేస్, యాక్షన్‌ సీక్వెన్స్‌ సమయంలో ప్రేక్షకుడు గుండె నిండా గాలి తీసుకునే విజిల్‌ వేసే అంత స్పేస్‌ కలిగించారు రుస్సో బ్రదర్స్‌. ఎక్కడో అమెరికాలో తయారైనప్పటికీ మనందరం కనెక్ట్‌ అయ్యే ఎమోషన్స్‌ ఈ సినిమా ఇండియాలోనూ ఇంత బాగా పాపులర్‌ అవ్వడానికి కార ణం.

సూపర్‌ హీరోల ఎండ్‌కు, ఎండ్‌ యాక్ట్‌ (క్లైమాక్స్‌)ను 4 కేకలు, 6 విజిల్స్‌తో ఉండేలా ప్లాన్‌ చేశారు. మార్వెల్‌ సృష్టించిన ఈ అవెంజర్స్‌ను ఆస్వాదించడమే సూపర్‌హీరోలకు మనమిచ్చే ఫేర్‌వెల్‌. మార్వెల్‌ అన్నట్టు ఈ సూపర్‌ హీరోలు నిజంగానే తిరిగి రారా? ఆపదలో ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు వచ్చేవాడే సూపర్‌ హీరో. చూద్దాం అవసరమైనప్పుడు మార్వెల్‌ స్టూడియోస్‌  ‘రీబూట్‌’ అనే బటన్‌ నొక్కకపోదా? సూటు, సుత్తి పట్టుకొని మళ్లీ సూపర్‌ హీరోలు తిరిగి రాకపోరా?

పాత్రలను ముగించగలం కానీ వాటి మీద ఉన్న అభిమానాన్ని? మా హార్ట్‌ని ఇంతలా బ్రేక్‌ చేసిన మీకేం ఇవ్వగలం? బాక్సాఫీస్‌ రికార్డులను చిత్తుచిత్తుగా బ్రేక్‌ చేయడం తప్ప అనుకున్నట్టున్నారు అభిమానులు. విడుదలైన రోజే ‘ఎండ్‌ గేమ్‌’ టాక్‌ సూపర్‌గా ఉంది. వసూళ్ల విధ్వంసం చూస్తుంటే ప్రపంచ టాప్‌ గ్రాసర్‌ ‘అవతార్‌’ను దాటే చాన్స్‌ ఉందంటున్నారు ట్రేడ్‌ విశ్లేషకులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement