విజయం అనేది ఒకరు వేసిన భిక్షగా పొందినవారి తీరు వేరుగా ఉంటుంది. విజయాన్ని ఊహించి, నిర్మించి, సొంతం చేసుకున్నవారి తీరు వేరుగా ఉంటుంది. ఆయుష్మాన్ ఖురానా విజయం అతడు కష్టపడి సంపాదించుకున్నది. పరాజయం విసిరిన ప్రతి రాయిని వరుసగా పేర్చి ఇవాళ బాలీవుడ్ కాలనీలో తన సౌధాన్ని నిర్మించుకున్నాడు.చిన్న కుటుంబం నుంచి వచ్చిన చిన్న కుర్రాడు అనేక ప్రతికూలతలను దాటి హీరో కావచ్చనడానికి ఇటీవలి ఉదాహరణ ఆయుష్మాన్. ప్రయోగాలు చేసే నటుడిగా కమల్‌హాసన్‌ను చెప్పుకుంటే ఇతణ్ణి బాలీవుడ్ కమలహాసన్ అనవచ్చు.
ఆయుష్మాన్ ఖురానాను తెలుసుకోవాలంటే మీరు నెట్‌ఫ్లిక్స్‌లోనో, అమేజాన్‌లోనో అతడి సినిమాలు చూడాలి. ‘విక్కీడోనర్’, ‘నౌటంకి సాలా’, ‘హవాయిజాదా’, ‘దమ్ లగాకే హైసా’, ‘బరేలీకి బర్ఫీ’, ‘శుభ్ మంగల్ సావధాన్’, ‘అంధా ధున్’, ‘బధాయి హో’... ఇవన్నీ ఒకదానికి ఒకటి పోలిక లేని కథలు. ఇంకా చెప్పాలంటే ఇంతకు ముందు ఏ హీరో చేయని కథలు. ఆయుష్మాన్ ఖురానా ఈ సినిమాలు చేసి నిరూపించుకున్నాడు. నిలబడ్డాడు. కాని ఆ జర్నీ ఏమీ సులువు కాదు.
చండీగఢ్ కుర్రాడు
ఆయుష్మాన్ ఖురానా చండీగఢ్ విశాలమైన వీధుల్లో నటుడు కావాలనే కలలతో తిరిగాడు. తండ్రి జ్యోతిష్యుడు. తల్లి గృహిణి. ఇంట్లో నానమ్మ ఆయుష్మాన్ ఖురానాను నవ్వించడానికి దేవ్ ఆనంద్, రాజ్ కపూర్‌లను ఇమిటేట్ చేసి నవ్వించేది. నాలుగేళ్ల వయసులో మొదటిసారి సినిమా హాలులో చూసిన ‘తేజాబ్’ సినిమా గుర్తుండిపోయి అలా స్క్రీన్ మీద కనిపించాలనే బాల్య కుతూహలం రేపింది. కాని అందుకు తగ్గ రూపం లేదు. ఆకారం లేదు. ఎత్తు తక్కువ. ఎత్తు పళ్లు. కాని బాగా పాడేవాడు. డాన్స్ చేసేవాడు.
కాని న్యూనత వల్ల ఎవరిముందూ చేసేవాడు కాదు. ‘వీడికి ఇవి చేతనవును. స్టేజీ మీద చేయడం వస్తే చాలు’ అని తండ్రి అవకాశం దొరికితే చాలు స్టేజీ మీదకు తోసేవాడు. అలా ఆయుష్మాన్ స్టేజ్ మీద నటించడం నేర్చుకున్నాడు. కాలేజీ రోజుల్లో నాటకాల ట్రూపులు తయారు చేసి దేశమంతా స్ట్రీట్ ప్లే, స్టేజ్ ప్లే చేస్తుండేవాడు. ట్రయిన్లలో ప్రయాణం చేసేటప్పుడు కంపార్ట్‌మెంట్‌లలో తిరిగి పాడుతూ డబ్బులు కలెక్ట్ చేసి నాటకాలకు ఉపయోగించేవాడు. అనుభవం ఉంది. ఇక అవకాశం రావడమే మిగిలింది.
మొదట రేడియోలో...
ఆయుష్మాన్ డిగ్రీ అయ్యే సమయానికి దేశంలో ఎఫ్.ఎం చానెల్స్ ఓపెన్ అవుతున్నాయి. ఆయుష్మాన్ ఢిల్లీలోని బిగ్ ఎఫ్.ఎంలో రేడియోజాకీగా పని చేశాడు. ఆ అనుభవంతో ఎం టీవీలో ‘రోడీస్’ షోలో పాల్గొని గెలిచాడు. ఎం టీవీ వీడియో జాకీగా కూడా పని చేశాడు. కాని షారూక్ ఖాన్ ఫ్యాన్ కావడం వల్ల షారుక్ మాస్ కమ్యూనికేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడని తెలిసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి తిరిగి చండీగఢ్ వెళ్లిపోయాడు. రెండేళ్ల పాటు చదివి తిరిగి ముంబై వచ్చాక అక్కడ రేడియో జాకీగా టీవీ వ్యాఖ్యాతగా పని చేశాడు. అలా ఉంటూ సినిమా అవకాశాల కోసం తిరిగితే నీ రూపు కెమెరాకు పనికి రాదు అని చెప్పిన వారే అంతా. చివరకు దర్శకుడు సూజిత్ సర్కార్ అతడికి బ్రేక్ ఇచ్చాడు.
వికీ డోనర్
వీర్య కణాల లోపం వల్ల తండ్రి కాలేని వారు కృత్రిమ పద్ధతిలో తండ్రి కావాలంటే పరాయి వీర్యకణాలు అవసరం. అందుకుగాను దేశంలో ‘స్పెర్మ్ డోనర్లు’ ఉన్నారు. అలాంటి స్పెర్మ్ డోనర్ కథను ‘వికీ డోనర్’గా తీశారు. సాధారణంగా ఇలాంటి కథను చేయడానికి కొత్తగా ఫీల్డ్‌లోకి వచ్చినవారు భయపడతారు. కాని ఆయుష్మాన్ ఆ పాత్రను అశ్లీలతకు తావు లేకుండా గొప్పగా చేసి హిట్ కొట్టాడు. అందులో తనే రాసిన పాడిన ‘పాని దా’ పాటకు అవార్డు పొందాడు.
జోర్ లగాకే హైస్సా
మన దేశంలో తొలిసారి విమానం ఎగరేయడానికి ప్రయత్నించిన బాపూజీ తల్పడే బయోపిక్ ‘హవాయిజాదే’లో నటించినా అది హిట్ కాలేదు. అయితే వారణాసి నేపథ్యంలో వచ్చిన ‘దమ్ లగాకే హైస్సా’ సినిమా సూపర్‌హిట్ అయ్యింది. టేప్ రికార్డర్‌లో పాటలు ఎక్కించే కుర్రాడి పాత్రలో ఆయుష్మాన్ నటించాడు. అందులో ఇష్టం లేని భార్యను క్రమంగా ప్రేమించే భర్తగా అందరికీ నచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ‘అంధా ధున్’ చాలా పెద్ద హిట్‌థ్రిల్లర్‌గా నిలిచింది.
అందులో కళ్లుండీ గుడ్డివాడిగా నటించే సంగీతకారుడి పాత్రలో ఆయుష్మాన్ ఖురానా టాప్‌క్లాస్ నటన ప్రదర్శించాడని విమర్శకులు మెచ్చుకున్నారు. ఇక వయసుకాని వయసులో గర్భం దాల్చిన తల్లితో ఎలా వ్యవహరించాలో తెలియని ఎదిగొచ్చిన కొడుకుగా ‘బధాయీ హో’లో నటించి ఆ సినిమానూ సూపర్ హిట్ చేశాడు. తాజా చిత్రం ‘ఆర్టికల్ 15’ ఒక సాంఘిక ప్రయోజనం ఉన్న సినిమా.
కొత్త తరం ఆశ
ఆయుష్మాన్‌లాంటి వాళ్ల వల్ల బాలీవుడ్ కొత్త కథల రచన, నటన సాధ్యమవుతోంది. లైంగికస్తంభన సమస్య ఉన్న యువకునిగా ‘శుభ మంగళ్ సావధాన్’లో నటించిన ఆయుష్మాన్ ఇప్పుడు హోమోసెక్సువాలిటీ వస్తువును తీసుకొని ‘శుభ మంగళ్ జ్యాదా సావధాన్’లో నటిస్తున్నాడు. అలాగే అమితాబ్‌తో ‘గులాబో సితాబో’లో నటిస్తున్నాడు. ఈ ప్రయాణం కొనసాగాలని కోరుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment