ఆ రికార్డ్ నాదే..! | B haind the Reel Sathya Sri | Sakshi
Sakshi News home page

ఆ రికార్డ్ నాదే..!

Published Mon, Jul 28 2014 12:56 AM | Last Updated on Fri, Sep 28 2018 4:53 PM

ఆ రికార్డ్ నాదే..! - Sakshi

ఆ రికార్డ్ నాదే..!

  బిహైండ్ ది రీల్  సత్యశ్రీ
  రికార్డులు బద్దలు కొట్టడం.. చరిత్ర తిరగ రాయడం...  వందేళ్ల భారతీయ సినీ చరిత్రలో ఈ సంచలనాలు సృష్టించిన వారు ఎందరో... కానీ, సత్యశ్రీ రికార్డుని మాత్రం ఎవరూ బద్దలు కొట్టలేరు.. ఒకవేళ కొట్టాలంటే..  తల బద్దలు కొట్టుకోవాల్సిందే... రెండు చేతులూ పోగొట్టుకోవాల్సిందే... విచిత్రంగా ఉంది కదూ.. జీవితమే విచిత్రాలమయం... కొన్ని విచిత్రాలు ఆనందానికి గురిచేస్తాయి..
 కొన్ని జీవితాన్ని తలకిందులు చేసేస్తాయి.. సత్యశ్రీకి అలానే జరిగింది కానీ... తలకిందులైన జీవితాన్ని ఆయన ఓ గాడిన పెట్టుకున్నారు... ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవగలిగారు.. మనోనిబ్బరానికి చిరునామాగా నిలిచిన సత్యశ్రీ జీవితం వైపు ఓ ప్రయాణం...
 
 మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు తనికెళ్ల సత్యనారాయణ వరప్రసాద్. సినిమాలంటే చాలా ఇష్టం. రచన, దర్శకత్వం, నటన.. ఇలా ఏ శాఖలో అయినా రాణించాలనుకున్నారు. ఎన్నో కలలను మోసుకుంటూ హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. లక్కీగా ప్రొడక్షన్ మేనేజర్ సింహంతో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారా ప్రముఖ నిర్మాత ఓఎస్సార్ ఆంజనేయులుతో పరిచయం. ఆయన నిర్మించిన చిత్రాలకు దర్శకత్వ శాఖలో చేరారు. మరోవైపు పలు చిత్రాలకు కామెడీ ట్రాక్స్ రాశారు. కలం పేరు ‘సత్యశ్రీ’. ఆ పేరుతోనే ఇండస్ట్రీలో పాపులర్.
 
  రాసినందుకు ‘డబ్బు కావాలా...’, రాశారంటూ టైటిల్స్‌లో ‘పేరు కావాలా..’ తేల్చుకోమన్నారు. డబ్బు లేకపోతే పొట్ట నింపుకోవడం ఎలా? ‘డబ్బే కావాలి’ అన్నారు సత్యశ్రీ. అంతే.. డబ్బిచ్చారు కానీ.. ఆయన రాసిన అద్భుతమైన కామెడీ ట్రాక్‌లు, ఇతర రచనలకు పేరు వేయలేదు. ఓ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఆరంభించి, ఎంతోమంది నటీనటులను, సాంకేతిక నిపుణులను తీర్చిదిద్దారు. ఇలా ఓ పదిహేనేళ్లు గడిచిపోయాయి. తెరపైన పేరు రాకపోయినా.. తెరవెనక మాత్రం బాగానే పేరు సంపాదించుకున్నారు సత్యశ్రీ. అలానే ఉంటే.. తెరపైన కూడా పేరు కనిపించేదేమో..
 
 కానీ... అది 1997. దర్శకునిగా ‘ముగ్గురూ ముగ్గురే’ అనే సినిమాకి శ్రీకారం చుట్టారు సత్యశ్రీ. కొన్నాళ్లు షూటింగ్ సజావుగానే సాగింది. నవంబర్ 28న ఆ దుర్ఘటన జరిగి ఉండకపోతే విడుదల అయ్యుండేది. కానీ, సత్యశ్రీకి ఊహించని షాక్ తగిలింది. టీవీ సరిగ్గా రాకపోవడంతో యాంటెనా సరిచేద్దామని మేడపెకైళ్లారాయన. రెండు చేతులతో యాంటెనాని పట్టుకున్నారు... అంతే పెద్ద శబ్దం. ‘‘ఆ శబ్దం సమయం కేవలం తొమ్మిది సెకన్లే’’ అన్నారు సత్యశ్రీ. ఆ మేడ మీద నుంచి అమాంతం కిందపడ్డారు. ‘ఇక అయిపోయాం...’ అనుకుంటూనే స్పృహ కోల్పోయారు.
 
 కట్ చేస్తే... ఆస్పత్రిలో చేర్చారు. ‘ప్చ్ లాభం లేదు..’ డాక్టర్లు తేల్చేశారు. అక్కణ్ణుంచి మరో ఆస్పత్రికి. అక్కడా అదే సమాధానం. ‘‘ఈ మాటలన్నీ లీలగా వినిపించాయి. దాదాపు ఆశలు వదిలేసుకున్నా’’ అన్నారు సత్యశ్రీ. మరో ఆస్పత్రిలో ‘ఓకే’ అన్నారు. చికిత్స ప్రారంభమైంది. తల మీద పెద్ద గాయం. చేతులు తెగిపోయాయి. కాళ్ల పరిస్థితి ఘోరం. ఏడు శస్త్ర చికిత్సలు జరిగాయి. మూడు నెలలకు పైగా ఆస్పత్రిలోనే. మొత్తం వైద్యానికి అయిన ఖర్చు ‘ఆరు లక్షలు’. ‘‘ఆర్థిక పరిస్థితి అంతంత  మాత్రంగా ఉన్న నాకు చిత్రసీమవారు అందించిన సహాయం మరువలేనిది. ముఖ్యంగా దర్శకులు దాసరి నారాయణరావుగారు, శ్రీనివాస్‌రెడ్డి (‘డమరుకం’ ఫేం) చేసిన మేలు మర్చిపోలేనిది’’ అన్నారు సత్యశ్రీ. ఇటీవల ఎడిటర్ కేయస్ మోహన్‌గారు హైదరాబాద్‌లో 20 ఎకరాల భూమి ఇచ్చారనీ, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కూడా ఆయన అన్నారు.
 
 చికిత్స పూర్తయ్యింది. ‘‘ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చేశారు. రెండు చేతులూ లేవు. కాళ్లు అంతంత మాత్రంగా నడవనిస్తున్నాయి. ఏం చేయాలి? ఇతరుల మీద ఆధారపడి బతకాలా?... నో... అలాగని ఆత్మహత్య చేసుకోవాలా? చేసుకొని సాధించేదేంటి? ఉంటే ఏదైనా సాధించొచ్చుగా అనుకున్నారు. అప్పుడెన్నో పుస్తకాలు తిరగేశారు. చేతులు, కాళ్లు విరిగినవాళ్లకి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసే కృత్రిమ అవయవాల గురించి వాకబు చేయడం మొదలుపెట్టారు. మరి.. సత్యశ్రీ కొన్ని కోట్ల మందికి స్ఫూర్తి కావాలని ఆ భగవంతుడు అనుకున్నాడేమో. మార్గం చూపించేశాడు.
 
 పంజాబ్‌లో ఓ ప్రోస్థటిక్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో కృత్రిమ అవయవాలు అమరుస్తున్నారని సత్యశ్రీకి తెలిసింది. మనసులో చిన్న ఆశ. పంజాబ్ వెళ్లారు. నిజమైన చేతులను తలపించే ‘ప్రోస్థటిక్ హ్యాండ్స్’ అమర్చారు. కానీ, వీటివల్ల ఉపయోగం ఏంటి? అనుకున్నారు సత్యశ్రీ. రాయలేని బతుకు ఎందుకు? అని నిరాశపడ్డారు. సత్యశ్రీ పట్టుదల, రాయాలనే ఆరాటం గమనించిన డాక్టర్లు రాసుకోవడానికి వీలుగా చేతులు అమర్చారు. ‘‘బహుశా ప్రపంచంలో తొలిసారి ఇలాంటి చెయ్యిని అమర్చింది నాకేనేమో! మళ్లీ కలం పట్టే అవకాశం ఆ దేవుడు కల్పించాడు. నేనెవరి మీదా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ చేతులతో నేను వంట చేసుకోగలను, నా బట్టలు నేనే ఉతుక్కోగలను’’ అని చెప్పారు సత్యశ్రీ.
 
 ఇప్పటివరకు తనకు సహాయం చేసినవారిని మర్చిపోలేదు సత్యశ్రీ. తనకు చికిత్స చేసినప్పుడు హిందువులు, ముస్లిమ్‌లు, క్రైస్తవులు.. ఇలా అందరూ రక్తం ఇచ్చారని ఆయన చెప్పారు. అందుకే తన కుమారుడికి ఏదో ఒక మతాన్ని ప్రస్తావిస్తున్నట్లుగా కాకుండా ‘కుందన్ సాయి’ అని పేరు పెట్టుకున్నారు. అన్నట్లు.. సత్యశ్రీకి పెళ్లయ్యింది ఆయనకు ప్రమాదం జరిగిన తర్వాతే. వ్యక్తిగత జీవితపరంగా ఆనందంగా ఉన్న సత్యశ్రీ ఇప్పుడు వృత్తిపరంగా కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారు.
 
 ప్రస్తుతం ‘టెన్షన్... టెన్షన్’ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘సినిమా ప్రారంభించిన రోజునే సీడెడ్ ఏరియా హక్కులు అమ్ముడైపోయాయి’’ అన్నారు సత్యశ్రీ. ఈ చిత్రంతో ఆయన గిన్నిస్ రికార్డ్ సాధించనున్నారు. ‘‘అంగ వైకల్యం ఉన్న వ్యక్తి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. ఈ నాలుగు శాఖలకూ పని చేసిన దాఖలాలు లేవు. ఆ రికార్డ్ నాదే’’ అని చెప్పారు సత్యశ్రీ.
 
 పస్తుతం సత్యశ్రీ కోరిక ఒక్కటే.. నిజమైన చేతులు
 అమరుస్తారని తెలిసిందట. ‘‘ప్రపంచంలో ఇప్పటికే  33 మందికి ఈ చేతులు విజయవంతంగా అమర్చారు. నా తదుపరి అడుగులు ఈ ప్రయత్నంవైపే’’ అన్నారు సత్యశ్రీ. దీనికి 45 లక్షల రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు. అంత భరించగలరా? అంటే.. ‘‘ఆర్థికంగా ఫరవాలేదు. నాకు సహాయం చేయడానికి సినిమా పరిశ్రమలో బోల్డంత మంది మంచివాళ్లు ఉన్నారు’’ అని నమ్మకంగా చెప్పారు సత్యశ్రీ.
 
 - డి.జి. భవాని
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement