నిర్మాతల పేరు చెబితే సినిమాలు ఆడే రోజులు రావాలి | B Nagi Reddy Memorial Prize ceremony in Jagapathi Babu | Sakshi
Sakshi News home page

నిర్మాతల పేరు చెబితే సినిమాలు ఆడే రోజులు రావాలి

Published Sun, Apr 16 2017 11:17 PM | Last Updated on Tue, Sep 5 2017 8:56 AM

B Nagi Reddy Memorial Prize ceremony in Jagapathi Babu

– బి. నాగిరెడ్డి స్మారక పురస్కార ప్రదానోత్సవంలో జగపతిబాబు


‘‘ఒకప్పడు బి. నాగిరెడ్డిలాంటి స్టార్‌ నిర్మాతలుండేవారు. ఇప్పడు నిర్మాత అంటే ఎవరు? అని అడుగుతున్నారు. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అన్నం పెట్టే నిర్మాత తెలియకపోవడం దురదృష్టకరం. ఈ పరిస్థితి మారాలి. మళ్లీ నిర్మాతను బట్టి... వారి పేరు చెబితే సినిమాలు ఆడే పరిస్థితి రావాలి’’ అన్నారు ప్రముఖ నటుడు జగపతిబాబు. విజయ వాహినీ స్టూడియో అధినేత బి. నాగిరెడ్డి పేరిట ప్రతి ఏడాది చక్కటి కుటుంబ కథా చిత్రాలు తీసిన నిర్మాతకు ఇచ్చే ‘బి.నాగిరెడ్డి స్మారక పురస్కారం’ 2016కు గాను ‘పెళ్లి చూపులు’ చిత్రనిర్మాత రాజ్‌ కందుకూరికి ప్రదానం చేశారు.

ఆయనకు మొమెంటోతో పాటు రూ.1.5 లక్షల చెక్‌ను బి. నాగిరెడ్డి తనయుడు వెంకటరామిరెడ్డి–భారతీరెడ్డి దంపతులు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఈ వేడుక జరిగింది. జగపతిబాబు మాట్లాడుతూ – ‘‘చిన్న సినిమాలూ ఆడతాయనే నమ్మకాన్ని కలిగించిన ‘పెళ్లి చూపులు’కు ఈ అవార్డు రావడం చిన్న నిర్మాతలకు ఎంతో ఊరటనిచ్చింది’’ అన్నారు.

నటి, ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ – ‘‘కథను నమ్మి తీసిన ‘పెళ్లి చూపులు’కు ఈ అవార్డు ఇచ్చి చిన్న సినిమాలకు ప్రాణం పోశారు. జ్యూరీ సభ్యులు గొల్లపూడి మారుతీరావు, సింగీతం శ్రీనివాసరావులు ఈ చిత్రాన్ని ఎంపిక చేసిన తర్వాత కొద్ది రోజులకు రెండు జాతీయ అవార్డులు కూడా రావడం వారి ఎంపికకు నిదర్శనం. బి. నాగిరెడ్డిగారి విజయ సంస్థలో నేను మూడు సినిమాల్లో నటించడం సంతోషంగా ఉంది’’ అన్నారు.

రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ – ‘‘నేను సినిమా రంగంలోకి రావడానికి మా నాన్నగారు ముఖ్య కారణం. ఆయన రాసిన కథతో తీసిన ‘గౌతమబుద్ధుడు’ సినిమాకు నంది అవార్డు వచ్చింది. దలైలామా అభినందించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిగారు ఆడియో ఆవిష్కరించారు. ‘పెళ్లి చూపులు’కు ఈ అవార్డు రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్‌ బృందం విజయ ప్రొడక్షన్‌ చిత్రాలలోని పాటలను ఆలపించారు. గొల్లపూడి మారుతీరావు, సింగీతం శ్రీనివాసరావు, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్‌ వి. విజయరామరాజు, బి. నాగిరెడ్ది కుటుంబీకులు ఆనం ప్రేమ్‌కుమార్‌రెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
– సాక్షి, రాజమహేంద్రవరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement