తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన బాహుబలి 2 ఈ శుక్రవారం చైనాలో భారీగా రిలీజ్ అయ్యింది. బాహుబలి తొలి భాగం చైనాలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో రెండో భాగం విషయంలో చిత్రయూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో చైనా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాను మరోసారి ఎడిటింగ్ చేయించారు. అంతేకాదు ఏకంగా 7వేలకు పైగా స్క్రీన్లలో సినిమాను రిలీజ్ చేశారు.
బాహుబలి నిర్మాతలు తీసుకున్న జాగ్రత్తలు బాగానే ఫలించినట్టున్నాయి. బాహుబలి 2 తొలి రోజు 2.85 మిలియన్ డాలర్లు (19 కోట్లు) కలెక్ట్ చేసింది. కేవలం తొలి షోతోనే మిలియన్ మార్క్‌ను అందుకొని సత్తా చాటింది. బాహుబలి తొలి భాగం చైనాలో ఫుల్ రన్‌లో సాధించిన 1.18 మిలియన్ డాలర్ల కలెక్షన్లను.. బాహుబలి 2 తొలి రోజే సాధించటం విశేషం. అంతేకాదు చైనాలో ఘనవిజయం సాధించిన దంగల్, భజరంగీ బాయ్‌జాన్ సినిమాల తొలి రోజు కలెక్షన్ రికార్డ్‌లను సైతం చెరిపేసిన బాహుబలి 2, అక్కడ తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. తొలి రెండు స్థానాల్లో వరుసగా ఆమిర్ ఖాన్ సీక్రెట్ సూపర్ స్టార్, ఇర్ఫాన్ ఖాన్ హిందీ మీడియం సినిమాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment