
బాహుబలి దెబ్బకు రికార్డు బద్దలు!
ముంబై: ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ సినిమా బాక్సాఫీస్ అన్ని రికార్డులను తిరగరాస్తుందా? భారత సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తోందా? అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు. బాహుబలి దెబ్బకు రికార్డులు బద్దలు కావడం ఖాయమని ప్రముఖ బిజినెస్ ఎనలిస్ట్, విమర్శకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విటర్ పేజీలో పెట్టిన ఒపీయన్ పోల్ లో 70 శాతం మంది అభిప్రాయపడ్డారు. అప్పుడే వసూళ్ల గురించి మాట్లాడుకోవడం సరికాదని 30 శాతం మంది పేర్కొన్నారు. ‘వాతావరణం వేడిగా, తేమగా ఉంది. కానీ బాక్సాఫీస్ మాత్రం చాలా చల్లగా ఉంది. సినిమా వ్యాపారాన్ని మళ్లీ పుంజుకునేలా చేసేందుకు బాహుబలి 2 వస్తోంది. బాక్సాఫీస్ వద్ద తుఫాను రాబోతోంద’ని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ చిత్రం ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా కోసం అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విడుదల రోజున ఒక్క బెంగళూరులోనే 850పైగా షోలు వేయనున్నారు. పది రోజుల పాటు రోజుకు ఆరు షోలు ప్రదర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిచ్చింది. విడుదల రోజునే బాహుబలి రికార్డులు సృష్టించడం ఖాయమని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.