బల్గేరియాలో పది రోజులు
మదగజ ఘీంకారాలు, రథచక్రాల ధాటికి నలిగిపోతున్న అభాగ్యుల ఆర్తనాదాలు, గుర్రపు డెక్కల చప్పుళ్లు, కరవాల విన్యాసాలు, రాజకీయ యుక్తులు, కుయుక్తులు... వెరసి ‘బాహుబలి’. మహాభారతాన్ని తలపించే కథాంశంతో, కురుక్షేత్రాన్ని గుర్తుకు తెచ్చే యుద్ధ విన్యాసాలతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ‘బాహుబలి’ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. తండ్రీ కొడుకులుగా ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో రానా ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. అనుష్క, తమన్నా కథానాయికలు. కె.రాఘవేంద్రరావు సమర్పణలో అర్కా మీడియా పతాకంపై యార్లగడ్డ శోభు, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ బల్గేరియాలో జరుగుతోంది. పది రోజుల పాటు అక్కడే కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా చిత్రీకరిస్తారు. ఈ షెడ్యూల్‌తో ‘బాహుబలి’ తుది దశకు చేరుతుంది. తెలుగు తెరపై ఓ మహాద్భుతాన్ని ఆవిష్కరింపజేసే సినిమా ఇదనీ, హాలీవుడ్ సినిమాను చూస్తున్న అనుభూతి ప్రేక్షకుల్లో కలగడం ఖాయమని చిత్ర బృందం నమ్మకంగా చెబుతున్నారు. ‘బాహుబలి’ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో తొలి భాగాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సత్యరాజ్, రమ్యకృష్ణ కీలక భూమికలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: విజయేంద్రప్రసాద్, కెమెరా: కె.కె.సెంథిల్ కుమార్, సంగీతం: ఎం.ఎం. కీరవాణి.