
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నంది అవార్డులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. సమిష్టికృషితోనే ’లెజెండ్’ సినిమా విజయవంతమైందని ఆయన అన్నారు. ’లెజెండ్ సినిమాకు తొమ్మిది అవార్డులు వచ్చాయి. ఈ సినిమాకు అవార్డుల పంట పండింది. సమిష్టికృషితోనే ఇది సాధ్యమైంది’ అని చెప్పారు. అవార్డుల పంట కురిపించినందుకు నంది అవార్డుల కమిటీ జ్యూరీకి కృతజ్ఞతలు తెలిపారు. నంది అవార్డులు గెలుచుకున్న ఇతర సినిమాల నటీనటులకు, చిత్ర యూనిట్‌లకు ఆయన అభినందనలు తెలిపారు.
నంది అవార్డులపై వస్తున్న విమర్శలపైనా బాలకృష్ణ స్పందించారు. లెజెండ్ అనేది మామూలు టైటిల్ కాదని, ఈ టైటిల్ పెట్టినప్పుడు వివాదాలు వచ్చాయని అన్నారు. తమ సినిమా మాటలతో కాదు చేతలతో నిరూపించిందని చెప్పుకొచ్చారు. నంది అవార్డుల వివాదంపై విలేకరులు ప్రశ్నించగా..‘లెజెండ్ అనేది మామలూ టైటిల్ కాదు.. అది పెట్టినప్పుడే.. తెలుసు మీకు లెజెండ్ గురించి ఎలాంటి కాంట్రవర్సీలు ఉన్నాయో.. మాటలతో కాదు చేతలతో చూపించింది మా లెజెండ్ సినిమా’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు బావమరిది అయిన బాలకృష్ణకు, టీడీపీకి అనుకూలంగా ఉన్నవారికి నంది అవార్డులు ప్రకటించడంపై సోషల్ మీడియాలో, టాలీవుడ్‌లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.