
బాలకృష్ణ నెక్ట్స్ సినిమా ఫిక్స్
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, రాజకీయాల్లో బిజీగా ఉన్నా సినీరంగంలోనూ దూసుకుపోతున్నాడు. ఇటీవల గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో వంద సినిమాల మైలురాయిని అందుకున్న బాలయ్య, ప్రస్తుతం తన 101వ సినిమాలో నటిస్తున్నాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 101వ సినిమాలో మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించనున్నాడు.
ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు బాలకృష్ణ. చాలా రోజులుగా చర్చలు జరుగుతున్న కె ఎస్ రవికుమార్ చిత్రాన్ని 102వ సినిమాగా ఫైనల్ చేశాడు. రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసే రవికుమార్ గతంలో చిరంజీవి, రాజశేఖర్ లతో తెలుగు సినిమాలను కూడా తెరకెక్కించాడు. చాలా కాలం తరువాత బాలకృష్ణ హీరోగా ఓ కమర్షియల్ సినిమాను రూపొందించనున్నాడు.
ఎం రత్నం కథ, మాటలు అందిస్తున్న ఈ సినిమాను సికె ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. పూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే కెఎస్ రవికుమార్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.