పవర్‌ఫుల్ లెజెండ్
‘రేయ్... నీకు కావాల్సింది నేను. నాతో పెట్టుకో. పదిమందితో రా. పదికి పది పెంచుకుంటూ రా. పదిసార్లు రా...’ ‘సింహా’ సినిమాలో... అండర్ ప్లే చేస్తూ, బేస్ వాయిస్‌తో బాలయ్య ఈ డైలాగ్ చెబుతుంటే... థియేటర్లు విజిల్స్‌తో మోతెక్కిపోయాయి. అభిమానులైతే ఉత్సవమే చేసుకున్నారు. ఓ విధంగా ఆ సినిమాతో నందమూరి అభిమానుల ఆకలిని తీర్చేశారు దర్శకుడు బోయపాటి శ్రీను. దాదాపు ఆరేడేళ్ల విరామం తర్వాత బాలయ్యకు వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘సింహా’. ఆ సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయం బాలయ్యకు రాలేదు. ఇది అభిమానులకు బాధ కలిగిస్తున్న అంశం. అందుకే.. మళ్లీ వారి మనసుల్లో ఆనందాన్ని నింపే పనిలో ఉన్నారు బోయపాటి.
‘సింహా’ను తలదన్నే పవర్‌ఫుల్ విజయం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారాయన. ఆ శ్రమకు ప్రతిరూపంగా ‘లెజెండ్’ తయారవుతోంది. ఫార్చునర్ కారు పక్కన కోర మీసం తిప్పి సింహంలా నిలబడ్డ బాలయ్య స్టిల్‌ను అభిమానుల కోసం కొత్త సంవత్సరం కానుకగా... నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర విడుదల చేశారు. ఇప్పటికి 80 శాతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఫారిన్‌లో పాటలను, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఫిబ్రవరిలో విడుదల చేసి, మార్చి నెలాఖరున సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.