కృష్ణవంశీ తర్వాత నువ్వే అన్నారు!
సినిమా డెరైక్టర్ కావాలనుకుని బంగారంలాంటి జాబ్ వదిలేసుకున్నాడు శ్రీరామ్ ఆదిత్య. తండ్రి కూడా ఫుల్ సపోర్ట్. దాంతో తాను రాసుకున్న కథతో ఏడాది పాటు ఇండస్ట్రీ అంతా తిరిగాడు. చివరకు ఓ మంచి రోజున విజయ్, శశిధర్‌లను కలిశాడు. కట్ చేస్తే... ‘భలే మంచి రోజు’ సినిమాకు డెరైక్టర్ అయిపోయాడు. సుధీర్‌బాబు హీరోగా రూపొందిన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఈ దర్శకుడి మనోభావాలు...
సినిమా చూసి మా అమ్మా, నాన్న ఎగ్జైట్ అయ్యారు. ‘చాలా బాగా తీశావ్‌రా’ అని నాన్న హగ్ చేసుకున్నారు. నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. మెకానికల్ ఇంజినీరింగ్ చేశాను. నాకు డెరైక్షన్ అంటే ఇష్టం. అందుకే ఫేస్‌బుక్, గూగూల్‌లో పని చేస్తున్నప్పుడు కథలు రాసుకున్నాను. జాబ్ చేస్తూనే ఓ ఎనిమిది షార్ట్ ఫిలింస్ చేశాను. వాటిలో ఒకదానికి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. చివరకు జాబ్ మానేసి, డెరైక్షన్ ట్రై చేశా.
ఒక విభిన్న చిత్రం చేయాలనే ఆలోచనతో ‘భలే మంచి రోజు’ కథ రాసుకున్నాను. ఒక్క రోజులో జరిగే కథ కావడంవల్ల స్క్రీన్‌ప్లే పకడ్బందీగా ఉండాలి. ఈ కథ వినగానే సుధీర్‌బాబుతో చేద్దామని విజయ్ అన్నారు. సుధీర్‌బాబు ఈ చిత్రానికి పర్‌ఫెక్ట్ అనిపించింది. నేను చేసిన షార్ట్ ఫిలింస్ చూసి ఆయన అవకాశం ఇచ్చారు. నా అదృష్టం కొద్దీ మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదిరారు. పరుచూరి గోపాలకృష్ణగారైతే ‘కృష్ణవంశీ తర్వాత నటీనటుల నుంచి ఆ స్థాయిలో నటన రాబట్టుకున్నది నువ్వే’ అన్నారు.
ఈ చిత్రంలో ఐశ్వర్య పాత్ర అభ్యంతరకరంగా ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. ఆ పాత్ర మాట్లాడిన కొన్ని డైలాగ్స్ తీసివేశాం. అందుకే వల్గర్‌గా అనిపిస్తోంది. ఆ డైలాగ్స్ వినిపించి ఉంటే, అలా అనిపించి ఉండేది కాదు. ప్రస్తుతం నా దగ్గర నాలుగైదు కథలు ఉన్నాయి. నా తదుపరి చిత్రం గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదు. అందుకని ఏ కథతో సినిమా చేస్తాననేది ఇప్పుడే చెప్పలేను.