ఒక్క హిట్ వస్తే మా బావ స్టారే!
‘‘కొన్ని రోజుల ముందు యూట్యూబ్‌లో టీజర్ చూశా. కొత్తగా ఉందనిపించింది. ఇప్పుడు ప్రచార చిత్రం చూశా. బాగా నచ్చింది. ఇవాళ ప్రేక్షకులు కొత్తదనాన్నే కోరుకుంటున్నారు’’ అని హీరో మహేశ్‌బాబు అన్నారు. సుధీర్‌బాబు, వామిక జంటగా 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో విజయ్‌కుమార్, శశిధర్ నిర్మించిన చిత్రం ‘భలే మంచి రోజు’. సన్నీ ఎం.ఆర్. స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని మహేశ్‌బాబు ఆవిష్కరించి హీరో రానాకు అందించారు.
ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ -‘‘చిత్ర దర్శకుడి కాన్ఫిడెన్స్ నచ్చింది. సుధీర్‌ను అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. సుధీర్ అంటే నాకు ఇష్టం. ఎందుకంటే హార్డ్ వర్కింగ్ పర్సన్. ఒక మంచి హిట్ పడితే, స్టార్ అయిపోతాడు. ఈ సినిమాతో ఆ హిట్ వస్తుందని అనుకుంటున్నా’’ అని అన్నారు. ‘‘ఈ సినిమా రిలీజ్ రోజున ప్రేక్షకులకు ‘భలే మంచి రోజు’ అవుతుంది’’ అని రానా వ్యాఖ్యానించారు.
దర్శకుడు మాట్లాడుతూ -‘‘సినిమా చేయడం అనే నా కల ఈ చిత్రంతో తీరింది. నేనీ రోజు ఇక్కడ ఉన్నానంటే కారణం నా తల్లిదండ్రులే. యూనిట్ అందరం ఇష్టపడి చేసిన సినిమా ఇది’’ అన్నారు. హీరో సుధీర్‌బాబు, పరుచూరి గోపాలకృష్ణ పాల్గొన్న ఈ కార్యక్రమంలో అతిథులుగా రెజీనా, సందీప్ కిషన్, ‘దిల్’ రాజు, లగడపాటి శ్రీధర్, అనిల్ సుంకర, దేవా కట్టా, శ్యామ్‌దత్ తదితరులు పాల్గొన్నారు.