బిగ్‌బాస్‌: వరుణ్‌ను విజేతగా ప్రకటించిన సుమ | Bigg Boss 3 TeluguSuma Kanakala Entertained most | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌లో సుమ.. పుచ్చకాయ, బజ్జీలతో పొట్ట చెక్కలే

Published Tue, Oct 29 2019 9:12 AM | Last Updated on Wed, Oct 30 2019 3:24 PM

Bigg Boss 3 TeluguSuma Kanakala Entertained most - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ యాంకర్‌ సుమ అనుకున్నంత సందడీ చేశారు. బాగ్‌బాస్‌-3 లో గెస్ట్‌( ఆడియన్‌)గా ఎంటరైన సుమ నవ్వుల పువ్వుల దీపావళి  తీసుకొచ్చారు.  అందరూ  ఊహించినట్టుగానే బిగ్‌బాస్‌-3లోని కంటెస్టెంట్లనే కాదు ప్రేక్షకులనూ పొట్టలు చెక్కలయ్యేలా నవ్వించారు.  బిగ్‌బాస్‌ సీజన్‌లోనే ఇంత బాగా ప్రేక్షకుడు ఎంజాయ్‌ చేసిన  ఎపిసోడ్‌ మరొకటి లేదంటే ఎంతమాత్రం అతిశయోక్తి  కాదు. 

బిగ్‌బాస్‌-3 సీజన్‌ను క్లుప్తంగా రివ్యూ చేసిన బిగ్‌బాస్‌ ఆ తరువాత హౌస్‌లోకి సుమను ప్రవేశపెట్టాడు. ఇహ అక్కడినుంచి మొదలైంది రచ్చ..రచ్చ రంబోలా.. రంగ్‌దే.. రంగ్‌దే...పాటతో ముసుగు వేసుకుని డాన్స్‌తో సుమ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే..కంటెస్టెంట్స్‌ అందరూ తమన్నా..తమన్నా అంటూ హల్‌ చల్‌ చేశారు. చివరికి ముసుగుతీసి తనెవరో రివీల్‌ చేశారు. ఆరంభం నుంచే సుమ తనదైన పవర్‌ పంచ్‌లతో మొదలెట్టేశారు. రాగానే  మంచి నీళ్లు తాగుతారా అని  అడిగిన శ్రీముఖితో.. వచ్చినవాళ్లందరి చేత నీళ్లు తాగించేస్తున్నావుగా అంటూ పంచ్‌ వేశారు.

ఆ తరువాత  ఇల్లంతా కలియతిరిగి... ఒక్కొక్కరి బెడ్‌ను, మేకప్‌ సామాన్లు పరిశీలించారు. ముఖ్యంగా రాహుల్‌ బెడ్‌ పక్కన ఏముందంటూ అల్లరి చేశారు. ఆ తరువాత లివింగ్‌ రూం​,  వంటగది, వాష్‌రూంలను పరిశీలించారు. బిగ్‌బాస్‌ -3 హౌస్‌లో  ఏమేమి మిస్‌ అవుతున్నదీ అందరూ షేర్‌ చేసుకున్నారు. తరువాత హౌజ్‌లోకి వచ్చిన సుమ కోసం ప్రత్యేకంగా మటన్‌ బిర్యానీ చేసిపెట్టి, ఈ దీపావళిని మరింత ఆనందంగా జరుపుకోవాలని  కోరిన బిగ్‌బాస్‌.. దానికి సంబంధించిన  సరుకు సరంజామా పంపించారు. మధ్నాహ్నం 2 గంటలకు శ్రీముఖి,  బాబా  భాస్కర్‌ కుకింగ్‌ పనిలో వుండగా.. రాహుల్‌తో  సరదాగా పాట పాడించారు సుమ. ‘అదరా...నా గుండెలదరా..బొమ్మోలె ఉందిరా పోరీ..పాట పాడారు. అలాగే ‘ఏమైనదీ..ఏమో నాలో..కొత్తగా ఉంది నాలో’ అంటూ వరుణ్‌ కూడా చాలా హృద్యంగా.. ఫీల్‌తో ఆలపించాడు.

తర్వాత సుమ తన సహజమైన గేమింగ్‌ షోను స్టార్ట్‌ చేశారు. బిగ్‌ బాస్‌ పెట్టిన టాస్క్‌ ప్రకారం పార్టిసిపెంట్స్‌ అందరూ హెడ్‌ఫోన్స్‌ పెట్టుకొంటారు. వాళ్ల చెవిలో.. బిగ్‌బాస్ మ్యూజిక్‌ ప్లే చేస్తుండగానే.. సుమ చెప్పే వాక్యాన్ని, సామెతను.. డైలాగ్‌ను లిప్‌ మూమెంట్‌ ద్వారా గుర్తించి.. ఆమె చెప్పిందో ఏంటో చెప్పాలి. ముందుగా ఈ పోటీలో పాల్గొనే అవకాశం శ్రీముఖికే దక్కింది. మొత్తం మూడు ప్రశ్నల్ని శ్రీముఖి అలవోకగా సమాధానం చెప్పేసింది. తనదైన శైలిలో గట్టిగట్టిగా అరుస్తూ చెప్పడంతో.. చెవుల్లోం,చి రక్తాలు కారుతున్నాయంటూ సుమ జోక్‌ చేశారు.

1. పందాలు గుర్రాల మీద వేసుకోవాలి.. సింహాల మీద కాదు.. 2 చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు 3. బిగ్‌ బాస్‌గారూ మీ ఒకసారి మా యింటికి రావాలి.. ఈ డైలాగులను శ్రీముఖి అలవోకగా చెప్పి ఆకట్టుకున్నారు. ఇక, మీ ఆవిడంటే మీకు చాలా భయమా. ఒక ఇంగ్లీషు కవి  ఏమన్నాడో తెలుసా.. ఆపరా ఇంకొక్క మాట మాట్లాడితే నాలుక కోసేస్తా..డైలాగులు సుమ చెప్పగా.. వీటిని చెప్పడానికి బాబా పడినపాట్లు మామూలువి కావు. తరువాత వంతు వరుణ్‌ది. బుజ్జిగాడు.. బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు.. అన్న డైలాగుకు.. పుచ్చకాయ..పచ్చగా అంటూ వరుణ్‌ నానా తిప్పలు పడి..ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేశాడు. రెండుసార్లు ఇదే డైలాగును చెప్పగా.. చచ్చీ చెడి సాధించాడు. చివరికి జీవితంమంటే పోరాటం.. పోరాటంలోనే ఉంది జయం... డైలాగును కరెక్ట్‌గా చెప్పి సక్సెస్‌ అయ్యాడు.

లక్ష భక్ష్యములు భక్షించుట లక్ష్మయ్యకు సాధ్యమా.. గుర్తు పెట్టుకో..నీకంటే తోపు ఎవ్వడు లేడిక్కడ..నీకు బీపీ వస్తే..నీ పీఏ వణుకుతాడు..వంటి డైలాగులు అలీ రెజాకు ఇవ్వగా.. వాటిని చెప్పడం అలా కి సాధ్యంకాలేదు. ఈ సందర్భంగా కూడా నవ్వుల మతాబులు విరజిమ్మాయి. ‘పునర్నవి వెళ్లిపోయిన తరవాత బాధగా వుందా’ ఈ డైలాగును రాహుల్‌ అలవోకగానే చెప్పాడు. విష్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కంబొట్లు చెప్పడానికి మాత్రం కష్టపడ్డాడు. నా చావు నే చస్తా.. నీకెందుకు అన్న డైలాగును చెప్పలేక తికమక పడ్డాడు. అయితే నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగాడు పుట్టలేదు మామా డైలాగును సరిగ్గా చెప్పి ఆకట్టుకున్నాడు. 

అయితే విచిత్రం ఏమంటే.. ఈ గేమ్‌లో బాగా, తొందరగా ఆన్సర్‌ చేసిన వారికి కాకుండా.. ప్రేక్షకులను ఎక్కువ ఎంటర్‌టైన్‌ చేసిన వారికి ఎక్కువ మార్కులు రావడం విశేషం. మోస్ట్‌ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది వరుణ్‌. ఈ గేమ్‌షోలో సుమ హావభావాలు, పంచ్‌లతో బాగా ఆకట్టుకున్నారు. భోజనాలయ్యాక.. కాసేపు కునుకు తీయాలంటూ సుమ ప్రయత్నించారు. కానీ అంతలోనే బిగ్‌బాస్‌ కుక్కలు మొరిగిన వార్నింగ్‌ రావడంతో అది కుదరలేదు. మొత్తంమీద అందరూ  ఊహించినట్టుగానే...ఎదురు చూసినట్టుగానే.. సుమ తన ప్రత్యేకతను మరోసారి నిలబెట్టుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement