బిగ్‌బాస్‌.. శ్రీముఖికి షాక్! | Bigg Boss Nominated Sreemukhi To Next Week Elimination | Sakshi
Sakshi News home page

శ్రీముఖిపై సీరియస్‌ అయిన బిగ్‌బాస్‌

Published Fri, Aug 9 2019 10:33 AM | Last Updated on Thu, Aug 15 2019 3:55 PM

Bigg Boss Nominated Sreemukhi To Next Week Elimination - Sakshi

ఇప్పటివరకు చిన్నపాటి గొడవలు, మాటల యుద్ధం వరకే సాగిన ఆట హింసాత్మకంగా మారింది. దొంగలున్నారు జాగ్రత్త టాస్క్‌లో రవికృష్ణ చేతికి గాయం అయి రక్తం కారింది. దీంతో అంతా శ్రీముఖి వల్లే జరిగింది అంటూ అందరూ తనని విమర్శించారు. ఈ విషయాన్ని బిగ్‌బాస్‌ కూడా సీరియస్‌గా తీసుకుని శ్రీముఖికి శిక్ష విధించాడు. ఇక అంతకు ముందేమో హిమజ, అలీకి మధ్య గొడవ జరగగా..హిమజ.. అలీ కాళ్లు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో బిగ్‌బాస్‌ హౌస్‌ మరింత హీటెక్కింది.

కాళ్లపై పడి క్షమాపణ.. కనికరించని అలీ
టాస్క్‌లో భాగంగా ఇంట్లో దొంగలకు పట్టపగలే చుక్కలు చూపించారు తికమకపురం గ్రామస్తులు. దొంగలు, పోలీసులు, లాయర్‌.. ఎవరైనా సరే ఎంతో కొంత ముట్టు చెబితేనే గ్రామస్తులు వారికి కనీస సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో హిమజ కిచెన్‌లో దూరి నీళ్లు కావాలంది. అలీ రెజా వచ్చి.. ముందు డబ్బులు ఇచ్చి తాగు అన్నాడు. అయితే హిమజ అవేవీ వినిపించుకోకుండా వెళ్లి నీళ్లు తాగేసి ఎంచక్కా వెళ్లిపోసాగింది. తను డబ్బులు ఇచ్చేలా లేదు అని భావించిన అలీ డబ్బు తీసుకోడానికి హిమజ ప్యాంటు జేబులో చేయి పెట్టాడు. దీంతో ఇబ్బందికి గురైన హిమజ సోఫాలో పడిపోయి.. అలీ ముఖాన్ని రెండుసార్లు తన్నింది. దీంతో నన్ను తంతావా అంటూ అలీ.. అక్కడ చేయి ఎలా పెడతావంటూ హిమజ చాలాసేపు గొడవ పడ్డారు.

ఎంత వాదించిన లాభం లేదనుకున్న హిమజ  ‘నన్ను నేను రక్షించే క్రమంలో అలా తన్నానే తప్ప కావాలని కాదు. సారీ..’  అంటూ అలీ కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరింది. అయినప్పటికీ అలీ శాంతించలేదు. ‘నిన్ను కాళ్లు పట్టుకోమని నేను అడిగానా..? ఒక సారీ చెప్తే సరిపోయేది కదా’ అని విసుగుచెందాడు. ‘ఇప్పటికీ నన్ను నువ్వు అర్థం చేసుకోవట్లేదు’ అంటూ హిమజ కన్నీటి పర్యంతం అయింది. ఈ గొడవలో దూరి పెద్దమనిషిలా సర్ది చెప్పాలనుకున్న తమన్నాపై అలీ విరుచుకుపడ్డాడు. మధ్యలోకి రాకు, డబుల్‌ గేమ్‌ ఆడొద్దు.. అంటూ వార్నింగ్‌ ఇచ్చాడు.

ఇక వారిద్దరూ కాసేపు చర్చించుకుని కూల్‌ అయిపోగా.. దొంగలు మాత్రం దోచుకోడానికి ఎప్పుడు సందు దొరుకుతుందా అన్నట్టు దొంగ చూపులు చూస్తున్నారు. వస్తువులను కొట్టేసినంత సులువుగా నిధిని సాధించలేకపోతున్నారు. ఇదిలా ఉండగా జైల్లో పడిన శ్రీముఖి పోలీసులతో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకుని బయటికి వచ్చింది. వచ్చీ రాగానే వరుణ్‌ సందేశ్‌ను మాటలతో బుట్టలో పడేసి చాకచక్యంగా అతడి జేబులో ఉన్న మొత్తం డబ్బుని కొట్టేసి ట్రంకు పెట్టెలో పడేసింది. దీంతో షాక్‌ అవటం ఇంటిసభ్యుల వంతయింది.

ఎలిమినేషన్‌లో శ్రీముఖి
దాచి దాచి దొంగలపాలు అవడం ఇష్టం లేని గ్రామస్తులు నిధి చుట్టూ కాపలా పెంచారు. ఏదిఏమైనా నిధిని సంపాదించాల్సిందే అని నిర్ణయించుకన్న దొంగల ముఠా అందుకు స్కెచ్‌ వేసుకుంది. ప్లాన్‌లో భాగంగా శ్రీముఖి డంబెల్‌తో నిధి ఉన్న గాజు గ్లాస్‌ను పగలగొట్టి సాహసం చేసింది. అయితే శ్రీముఖిని మిగతా సభ్యులు పక్కకు లాగేయటంతో గ్లాస్‌ పగలగొట్టి డబ్బులు తీయమంటూ రవికి ఆదేశాలిచ్చింది. వెంటనే రవి ఏదీ ఆలోచించకుండా చేతితో గ్లాసు పగులగొట్టాడు. దీంతో అతని చేయికి దెబ్బ తగిలి రక్తం కారటాన్ని గుర్తించిన బిగ్‌బాస్‌ డాక్టర్‌ను పంపి రవికి వైద్యం అందించారు. అయితే ఇదంతా శ్రీముఖి వల్లే జరిగిందంటూ రాహుల్‌, వరుణ్‌, వితికా మాటల దాడి చేయగా శ్రీముఖి పక్కకు వెళ్లి ఏడ్చింది. గాయంతో బాధపడుతున్న రవికి బిగ్‌బాస్‌.. టాస్క్‌ల నుంచి తనకు ఉపశమనం తీసుకోవచ్చు అని ఆఫర్‌ చేసినప్పటికీ అతను సుతిమెత్తంగా తిరస్కరించాడు. ఇంటిలో వస్తువులను కదల్చకూడదన్న నిబంధనను ఇంటిసభ్యులు ఉల్లంఘించినందుకు, ఇంటిలో హింస చోటు చేసుకున్నందుకు టాస్క్‌ను బిగ్‌బాస్‌ రద్దు చేశారు. హింసకు కారణమైన శ్రీముఖిని తర్వాతి వారం నేరుగా ఎలిమినేషన్స్‌కు పంపిస్తున్నట్లుగా బిగ్‌బాస్‌ ప్రకటించారు.

మరోవైపు అలీ రెజా, పునర్నవిలకు బిగ్‌ బాస్‌ సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చారు. దీన్ని విజయవంతంగా పూర్తి చేస్తే తర్వాతి వారం ఎలిమినేషన్‌ నుంచి సేఫ్‌ అవుతారని బిగ్‌బాస్‌ పేర్కొన్నాడు. ఈ టాస్క్‌లో భాగంగా అలీ రెజా రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో చడీచప్పుడు చేయకుండా సీక్రెట్‌ గదిలోకి వెళ్లగా, పునర్నవి ఉదయంపూట సీక్రెట్‌ గదిలోకి ప్రవేశించింది. అలీరెజా ఆ గదిలో ఏం చేయాలో తోచక కాసేపు కెమెరా ముందు కుప్పిగంతులు వేశాడు. ఇక 18వ రోజు అలీ రెజా, పునర్నవి కనిపించకపోవటంతో ఇంటి సభ్యులు కాస్తంత కంగారు పడ్డా తర్వాత లైట్‌ తీసుకున్నారు. పైగా వారిద్దరూ తిరిగి ఇంట్లోకి రావాలంటే ఇంటిసభ్యులు కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్‌ తెలిపాడు. ఇందుకు హిమజ, బాబా భాస్కర్‌లు వ్యతిరేకించారు. త్యాగాల విషయానికొస్తే.. ఇంటి సభ్యులు వారం రోజులపాటు పాదరక్షలు లేకుండా తిరగాలి. మరో వారం రోజులు పెరుగును తీసుకోకూడదు. మరి ఇందుకు ఇంటి సభ్యులు ఏ విధంగా స్పందిస్తారు.. అలీ, పునర్నవి మళ్లీ ఇంటికి తిరిగొస్తారా అనేది చూడాలి..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement