
పీటీ ఉష తర్వాతే పీవీ సింధు!
పీవీ సింధు.. పరిచయ వాక్యాలు అవసరం లేనంతగా పాపులార్టీ తెచ్చేసుకుంది. రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన ఈ పదహారణాల తెలుగుమ్మాయ్ పేరు మార్మోగుతోంది. రజనీకాంత్ నుంచి సల్మాన్ ఖాన్ వరకూ ఇండియన్ సినిమా సెలబ్రిటీలందరూ పీవీ సింధు అభిమానులయ్యారు. ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తుండడంతో పీవీ సింధు బయోపిక్ తీస్తే ఎలా ఉంటుందనే అంశం తెరపైకి వచ్చింది.
ప్రముఖ నవలా రచయిత్రి శోభాడే ఓ అడుగు ముందుకేసి పీవీ సింధు బయోపిక్‌లో దీపికా పదుకొనే నటిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ సంగతలా ఉంచితే, ఒకవేళ పీవీ సింధు బయోపిక్ తీస్తే, మీరు నటిస్తారా? అనే ప్రశ్న సోనమ్ కపూర్ ముందుంచితే.. ‘‘పీవీ సింధు, సాక్షి మాలిక్ కంటే ముందు పీటీ ఉష బయోపిక్ తీయవలసిన అవసరం ఉంది. పీటీ ఉష బయోపిక్ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.
అల్రెడీ నేను ఓ బయోపిక్ (‘నీర్జా’)లో నటించాను. మరో మంచి కథ వస్తే తప్పకుండా నటిస్తాను’’ అని సమాధానం ఇచ్చారు. మన దేశం గర్వించేలా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన క్రీడాకారుల జీవితాలను వెండితెరపై ఆవిష్కరిస్తే ప్రజలకు స్ఫూర్తినిస్తాయని అభిప్రాయపడ్డారు సోనమ్. ఈ రోజు ప్రతి రంగంలోనూ మహిళలు రాణించడం సంతోషంగా ఉందన్నారు.